సోషల్ మీడియాపై నిఘా పెంచిన కేంద్రం: పాకిస్తాన్ యూ ట్యూచ్ ఛానెల్స్ నిషేధం

దిశ దశ, జాతీయం:

ఓ వైపున పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపె పనిలో నిమగ్నం అయిన భారత్ మరో వైపున సోషల్ మీడియా వేదికలపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ప్రసారం అవుతున్న వార్తా కథనాలను సునిశితంగా పరిశీలిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. పహల్గామ్ ఉగ్రవాద సంఘటన నేపథ్యంలో భారత భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా ప్రసారం చేస్తున్నారన్న అభియోగంపై పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా ఝులిపించింది. భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడంతో పాటు మతపరంగా సున్నితమైన అంశాలను ప్రసారం చేస్తున్నాయని, తప్పుడు వార్తా కథనాలు రిలే చేయడమే కాకుండా తప్పుదారి పట్టించే విధంగా ఉన్న వార్తలను ప్రసారం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో 16 యూట్యూబ్ ఛానెళ్లపై భారతదేశంలో నిషేధం విధించాలని హోంశాఖ సిఫార్సు చేసింది. ఈ మేరకు డాన్ న్యూస్, సమా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్, ది పాకిస్తాన్ రెఫరెన్స్ వంటి 16 యూ ట్యూబ్ ఛానెల్స్ ను నిషేదిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో వైపున అంతర్జాతీయంగా ప్రముఖ ఛానెల్ అయిన బీబీసీకి కూడా కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా వార్తలను ప్రసారం చేస్తోందని నోటీసులో పేర్కొన్నట్టు సమాచారం.

You cannot copy content of this page