దిశ దశ, కరీంనగర్:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ ఫిరాయింపుల విషయంతో పాటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసే అంశం గురించి ఆయన స్పందిస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆదివారం కరీంనగర్ మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించిన తీరు సరికొత్త చర్చకు దారి తీసింది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన అంశం గురించి స్పందించిన బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీతో చర్చించడం బీజేపీకి ఏం పని అని ప్రశ్నించారు. ఒకప్పుడు బీజేపీ గురించి హేళనగా మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ రాష్ట్రంలో ఏ పరిస్థితి చేరిందో గమనించాలన్నారు. కించపర్చే విధంగా, హేళనగా రాజకీయ నాయకులు మాట్లాడడం సరికాదని, విమర్శలు చేయడం సరైందే కానీ అహంకారంతో వ్యవహరించడం మాత్రం మంచి నడవడిక అనిపించుకోదన్నారు. ఒకప్పుడు బీజేపీ పార్టీ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఊటంకించిన బండి సంజయ్ ఇప్పుడు తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటని… డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా ఆ పార్టి పరిస్థితి మారిందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా లేరన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అహంకారంతో మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందోనన్న విషయంపై కేసీఆర్ ఫ్యామిలీని చూసి ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవల్సిన అవసరం ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు గంప కింద కమ్మినోళ్లలో ఒక్కొక్కరుగా వెల్లిపోతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు చాలా మంది బీజేపీలో చేరాలని ఆశిస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు.
హరీష్ రావుపై…
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హరీష్ రావు క్యారెక్టర్ గురించి ఆయన కితాబిచ్చిన తీరు అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. ఆయన మంచి నాయకుడని ప్రజల మనిషని వ్యాఖ్యానించిన బండి సంజయ్ కేసీఆర్, కేటీఆర్ వాళ్ల ఫ్యామిలీపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందన్నారు. అయితే హరీష్ రావుకు మంచి పేరుందని, ఉద్యమం చేసిన వ్యక్తి అని మెచ్చుకున్న కేంద్ర మంత్రి అయితే ఆయన తమతో టచ్ లో ఉన్నాడని తమ పార్టీలో చేరుతున్నాడని బ్రేకింగ్ న్యూస్ వేయవద్దని… తాను ఓపెన్ గా మాట్లాడుతున్నందునే హరీష్ రావు గురించి ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించానన్నారు. ఆయన కూడా బీజేపీ లోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే తమ పార్టీలో చేరాల్సి ఉంటుందని కుండ బద్దలు కొట్టారు.
కేసీఆర్ క్షేమంగా ఉండాలి…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వార్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నానని… గతంలో ఆనారోగ్యం పాలైనప్పుడు కూడా బాగుండాలని ఆకాంక్షించానన్నారు బండి సంజయ్. ఇంకోకరి నాశనం కోరే పార్టీ తమది కాదని, అటువంటి వ్యక్తిని తాను కాదని కామెంట్ చేసిన ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా బీజేపీలో చేరి తెలంగాణ అభివృద్దికి నిధులు సమీకరించుకుందామని ఆశిస్తున్నారన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి