దిశ దశ, వరంగల్:
మావోయిస్టు పార్టీ నుండి లొంగుబాట్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ పోలీసులు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పటికీ అప్పుడు అడవి బాట పట్టిన వారిని జనజీవనంలో కల్పించేందుకు సరికొత్త పంథా ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. దండకారణ్యంలో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ వారి భూమిక అత్యంత కీలకంగా ఉంది. లొంగుబాట పట్టిన వారిని ప్రోత్సహించేందుకు సరెండర్ అయిన వెంటనే రివార్డు ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టారు తెలంగాణ పోలీసులు. గతంలో లొంగిపోయిన వారికి రూ. 10 వేల వరకు ఆర్థిక సాయం అందించి ఆ తరువాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి రివార్డ్ ఇవ్వాలన్న అనుమతి వచ్చిన తరువాత సరెండర్ నక్సల్స్ కు రివార్డు ఇచ్చే విధానం ఉండేది. కానీ తాజాగా మావోయిస్టులు లొంగిపోయిన వెంటనే వారిపై ప్రకటించిన రివార్డును అందజేస్తుండడం గమనార్హం. గురువారం వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందు ఓ మహిళా నక్సల్ లొంగిపోగా ఆమెకు రూ. 20 లక్షల రివార్డుకు సంబంధించిన చెక్కును అందజేయడం విశేషం.
బంధువుల బాటలో…
వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం బుధరావుపేటకు చెందిన కోడి మంజుల అలియాస్ నిర్మల 1994లో పదో తరగతి చదువుతున్న క్రమంలో అడవి బాట పట్టారు. ఆమె తండ్రి అప్పటి పీపుల్స్ వార్ సానుభూతి పరునిగా పనిచేయగా, అన్న కోడి కుమారస్వామి అలియాస్ ఆనంద్, సమీప బంధువు కోడి వెంకన్న అలియాస్ గోపన్న నర్సంపేట ఏరియా కమిటీలో పని చేశారు. వీరిలో ఇద్దరు ఎన్ కౌంటర్ లో హతం అయిన క్రమంలో పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితురాలైన మంజుల నర్పంపేట దళంలో పనిచేసేందుకు అడవి బాట పట్టారు. 1996లో చేర్యాల దళంలో పని చేసిన ఆమె 1999లో నర్పంపేట దళ కమాండర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పెరం బుచ్చయ్య అలియాస్ సురేందర్ ను వివాహం చేసుకున్న తరువాత ఏరియా కమిటీ సభ్యురాలిగా పని చేసింది. మంజులను వివాహం చేసుకున్న సురేందర్ 2000 సంవత్సరంలో పోలీసుల ఎదుట లొంగిపోయినప్పటికీ ఆమె మాత్రం యూజీలోనే ఉండిపోయింది. 2001లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ నాయకత్వంలోని ప్రెస్ టీం ప్రొటెక్షన్ ప్లాటూన్ లో పనిచేసిన మంజుల 2002లో మహదేవపూర్ ఏరియా డిప్యూటీ కమాండర్ గా పని చేసింది. అప్పుడు డివిజనల్ కమిటీ సభ్యుడు కుంకటి వెంకట్ అలియాస్ రమేష్ ను వివాహం చేసుకున్న ఆమె డిసెంబర్ 24న అరెస్ట్ అయింది. 2004లో బెయిలుపై బయటకు వచ్చిన మంజుల తిరిగి పార్టీలో కొనసాగేందుకే మొగ్గు చూపి అడవుల్లోకి వెల్లిపోయింది. 2005 నుండి మహదేవపూర్, చేర్యాల, మహారాష్ట్రలోని సిరొంచ ఏరియాల్లో డిప్యూటీ కమాండర్ హోదాలో పని చేసి, 2007లో మణుగురు దళ కమాండర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఏరియా కమిటీ కార్యదర్శి వైద్య బృందానికి బాధ్యురాలిగా 2011 వరకు పనిచేశారు. 2012లో దర్బా డివిజన్ కమిటీ సభ్యురాలిగా, 2017లో బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్, మొబైల్ పొలిటికల్ స్కూల్ బాధ్యతలు చేపట్టారు. 2022 నుండి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా కోడి మంజుల పని చేస్తున్నారు. 2013లో దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు బలగాలపై దాడి చేసిన సంచలన ఘటనల్లో ఒకటైన జీరంఘాట్ వద్ద 27 మంది పోలీసులను మట్టుబెట్టిన కేసులో నిందితురాలిగా ఉంది. అంతే కాకుండా చిట్యాల, నర్సంపేట, ఏటూరునాగారం, నెక్కొండతో పాటు ప్రాంతాల్లో పనిచేసినప్పుడు చేసిన పలు ఘటనల్లో మంజుల భాగస్వామ్యం ఉంది. 2021లో కోవిడ్ బారిన పడడంతో పాటు అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో విప్లవ పంథాలో కొనసాగించేందుకు శరీరం సహకరించే పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం లొంగుబాట్లను ప్రొత్సహించేందుకు కల్పిస్తున్న పునరావాసంలో భాగంగా జనజీనవంలో కలిసిందని సీపీ అంబర్ కిషోర్ ఝా వివరించారు. ఈ సందర్భంగా కోడి మంజులపై ఉన్న రూ. 20 లక్షల రివార్డు చెక్కును సీపీ అందజేశారు.