జీఓ ఆదారంగా తీర్మానాలు…
హుజురాబాద్ పాలిట్రిక్స్
దిశ దశ, హుజురాబాద్:
జనరల్ బాడీ సమావేశానికి మీరు రాకుంటే మళ్లీ మళ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విశేష అధికారాలను ఉపయోగించుకుని మా పని మేం చేస్తాం అని చేతల్లో చూపారా మహిళా ఛైర్ పర్సన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఆమె సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను ఆధారం చేసుకుని కోరం లేకున్నా తీర్మానం చేసేశారు. దీంతో అసమ్మతి కౌన్సిలర్ల వ్యూహం ఎలా ఉండబోతోందన్నదే చర్చ నీయాంశంగా మారింది.
హుజురాబాద్ పాలిట్రిక్స్…
హుజురాబాద్ మునిసిపల్ ఛైర్ పర్సన్ గందె రాధికపై వ్యతిరేకత ఉన్న 21 మంది కౌన్సిలర్లు అంతా కలిసి అవిశ్వాసం పెడుతున్నామని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నోటీసు ఇచ్చారు. ఆ తరువాత అధిష్టానం జోక్యం చేసుకుని అసమ్మతీయులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. అయితే తనకు అవిశ్వాసం తీర్మానం చేపట్టకుండా ఉండాలని రాధిక కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ విషయంపై తుది నిర్ణయం వెలువడే వరకూ హోల్డ్ లో పడిపోయింది. అయితే అధికారికంగా తానే ఛైర్ పర్సన్ గా కొనసాగుతున్నందును తాను ఈ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన కోరం రాక పోవడంతో సమావేశాలు అర్థాంతరంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బుధవారం మరోసారి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన అధికారాలను ఉపయోగించుకుని పలు తీర్మానాలు చేశారు. 64 అంశాలకు గాను 59 అంశాలను ఆమోదించామని, ఈ సమావేశానికి 8 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఛైర్ పర్సన్ గందె రాధిక వెల్లడించారు. జీఓ 216 ప్రకారం కోరం లేకున్నప్పటికీ ఆయా అంశాలపై చర్చలు జరిపి తీర్మానం చేయవచ్చన్న అధికారాలు ఉన్నాయని వివరించారు. ఈ జీఓ ఆధారంగానే తాము ఈ రోజు సమావేశం నిర్వహించి 59 అంశాలు అమలు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి వాయిదా వేసిన 24 గంటల్లోగా సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టయితే కోరం అవసరం లేదని జీఓలో ఉందన్నారు. రెండు రోజుల క్రితం సమావేశం జరిగినప్పటికీ మంగళవారం హోలీ పౌర్ణిమ కారణంగా సెలవు ఉందని, దీంతో బుధవారం సమావేశం ఏర్పాటు చేసి కోరంతో సంబంధం లేకుండా ఆయా అంశాలపై తీర్మానం చేశామన్నారు.
కిం కర్తవ్యం..?
అసమ్మతి గళం విప్పి, సమవేశాలకు దూరంగా ఉన్న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా హుజురాబాద్ మునిసిపల్ లో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం సంచలనంగా మారింది. ఓ వైపున అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి గందె రాధికచే రాజీనామా అయినా చేయించాలని చూస్తుంటే మరో వైపున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓతో తన పని తాను చేసుకుంటూ వెల్తుండడం ఏంటన్న చర్చ సాగుతోంది. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలోనన్న విషయంపై అసమ్మతీయులంతా చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.