శ్రీ చైతన్య మహిళా కాలేజ్ తనిఖీ…
దిశ దశ, హైదరాబాద్:
సౌకర్యాలు కల్పించండి… కానీ కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకండి…వసతులు ఏర్పర్చకుండా విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నారెంటీ..? ఇరుకు గదుల్లో మీరైతే ఉండగలరా..? ఇల్లు తుడిచిన గుడ్డను అన్నంలో పిండితే మీరు తినగలుగుతారా..? స్టూడెంట్స్ ను మనుషుల్లా చూస్తున్నారా..? అంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొద్ది రోజులు తమ కాలేజీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్న ఛైర్మన్ శారద ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె చైతన్య కాలేజీ హాస్టల్ భవనం, క్లాస్ రూమ్స్ ను పరిశీలించి కాలేజీ యాజమాన్యం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాలేజీ ముందు మా కారు ఆగగానే ఎందుకు లాక్ చేశారో చెప్పాలని కాలేజీ సిబ్బందిని నిలదీశారు.
లీకేజీ నీరు పడ్డా…
భవనం పై నుండి లీకేజీ నీరు భోజనంలో పడిందని చెప్తే ఏమీ కాదు తినండని ఉచిత సలహా ఇస్తారా..? ఇరుకు గదుల్లో ఎలాంటి వెంటిలేషన్ లేదు, వాష్ రూమ్స్ సరిగా లేవు, వాష్ బేసిన్ల వద్ద నీరు లీకేజీ, ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకపోయి… కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయలేదంటూ నేరెళ్ల శారద మండిపడ్డారు. ఐదు ఫ్లోర్లు ఉన్న భవనంలోని అన్ని గదుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందా అని ప్రశ్నించారు. వీరిద్దరిని ఆరు నెలల పాటు శ్రీ చైతన్య మహిళా కాలేజీ హాస్టల్ రూమ్ లో ఉంచండి… ఎలుకలు, కాక్రోచుల వల్ల ఎదురయ్యే బాధ ఏంటో తెలుస్తుందన్నారు. రెండు రోజుల పాటు పిల్లలను గదిలో వేసి బందించారంట మీరు అసలు మనుషుల్లా వ్యవహరిస్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యార్థులను మనుషులు అనుకుంటున్నారా లేక లేదని పుశువుల్లా భావించి సౌకర్యాలు కల్పించడం లేదా అని అడిగారు.
లక్షల్లో ఫీజులు…
తమ సంస్థలకు బ్రాండ్ క్రియేట్ చేయడం… ఆ తరువాత లక్షల్లో ఫీజులు వసూలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్న ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ప్రత్యక్ష్య నరకాన్నే చవి చూస్తున్నారు. పేరు రాగానే శాఖోపశాఖలుగా విద్యా సంస్థలను విస్తరించే పనిలో పడుతున్న యాజమాన్యలు కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూడా ముందుకు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తమ కంటిపాపలు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారని కలలు కంటున్న పేరెంట్స్ కు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏం జరుగుతుందో తెలిస్తే షాకుకు గురికాక తప్పదు. తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని భావించే తల్లిదండ్రల ఆశలను ఆసరగా తీసుకుని ప్రైవేటు విద్యా సంస్థలు అటు ఆర్థిక దోపిడీకి ఇటు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలోనే ఇన్ని లోపాలు వెలుగులోకి వచ్చాయంటే ఆ కాలేజీలో ఎలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.