దిశ దశ, కరీంనగర్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్త్తం అయిన వి నరేందర్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. రెండు రోజులుగా ప్రభుత్వ కాలేజీల అధ్యాపక బృందం మద్దతు కోరిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంప్ ఆఫీసు కూడా ప్రారంభించారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఖరారు కాకముందే తన ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. స్వతంత్ర్య అభ్యర్థిగానైనా బరిలో నిలుస్తానని ప్రకటించిన వెంటనే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.
చర్చలివే..?
మూడు దశాబ్దాలకు పైగా విద్యా రంగంలో పటిష్టమైన పునాదులు వేసుకున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పట్టభద్రులను అనుకూలంగా మల్చుకోవడంలో ఎంత వరకు సక్సెస్ అవుతారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. మూడు తరాలతో అనుబంధం పెనవేసుకున్నానని, ఉత్తర తెలంగాణ అంతటా తన విద్యా సంస్థలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని నరేందర్ రెడ్డి చెప్తున్నారు. అయితే ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయిన ఆయన రాజకీయ క్షేత్రంలో సానుకూల ఫలితాలను ఎలా సాధిస్తారోనన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ప్రధానంగా పట్టభద్రులపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని భావిస్తున్న నరేందర్ రెడ్డి స్వతంత్రుడిగా పోటీ చేస్తే మాత్రం సవాళ్లను ఎదుర్కొక తప్పదు. ఇప్పటి వరకు జరిగిన పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన చాలా మంది కూడా పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన వారే. అయితే ఏ పార్టీ అండదండ లేకుండా పోటీ చేసి సక్సెస్ అవుతానన్న ధీమాతో నరేందర్ రెడ్డి రంగంలోకి దిగుతున్నందున పట్టభద్రులు ఆయన పట్ల ఎలాంటి సానుకూలతను వ్యక్తపరుసారన్న అంశమే అత్యంత ముఖ్యం. ప్రధానంగా ఆయన వ్యవహార శైలిపై సునిశితంగా పరిశీలించే అవకాశాలు ఉంటాయి. పట్టభద్రుల్లో ప్రొఫెషనల్స్, విద్యారంగంలో ఉన్న వారు, నిరుద్యోగులు, వివిధ రంగాల్లో స్థిరపడిన వారే ఉంటారు. వీరంతా కూడా నరేందర్ రెడ్డిని ఎలా అక్కున చేర్చుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది. ప్రైవేటు విద్యా రంగంలో శాఖోపశాఖలుగా విస్తరించిన నరేందర్ రెడ్డి విషయంలో నాణానికి ఒక వైపు చూస్తే ఆయన సక్సెస్ రేట్, బ్రాండ్ ఇమేజ్ ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని తేల్చి చెప్తోంది. మరో వైపు చూస్తే మాత్రం సమాజానికి నరేందర్ రెడ్డికి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ అత్యంత కీలకమైనది. అడ్మిషన్ల సమయంలో మాత్రమే పేరెంట్స్ తో మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వడం, మెరిట్ స్కూడెంట్స్ కు రాయితీలు ప్రకటించడం తీరా వేళకు కండిషన్స్ అప్లై అన్న రీతిలో వ్యవహరించిన తీరుతో కూడా చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రలు ఇబ్బందులు పడ్డ సందర్బాలు లేకపోలేదు. వీటిని అధిగమించేందుకు నరేందర్ రెడ్డిని నేరుగా కలిసే ప్రయత్నం చేసిన విద్యార్థులే అయినా పేరెంట్స్ అయినా ఆయనను కలుసుకునేందుకు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. చివరకు అడ్మిషన్లు తీసుకున్న తరువాత కాలేజీల్లో ఉండే యంత్రాంగం చెప్పిన రీతిలో నడుచుకోక తప్పని పరిస్థితి చాలా మంది స్టూడెంట్స్ ది. అంతేకాకుండా విద్యారంగంలో తనదైన ముద్ర వేసుకున్న నరేందర్ రెడ్డి కనీసం ఫోన్లు కూడా లిప్ట్ చేయరన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తుంటాయి. ఆయనకు నచ్చిన వారితో నచ్చినప్పుడు మాత్రమే మాట్లాడేందుకు ప్రయార్టీ ఇస్తారన్న అభిప్రాయలు కూడా లేకపోలేదు. అయితే రేపు చట్టసభకు ప్రతినిధిగా ఎన్నికైన తరువాత కూడా ఇలాంటి స్పందనే కనబరిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇంతకాలం విద్యా సంస్థల నిర్వహణ, విద్యా బోధన అంశాలకే పరిమితం అయిన ఆయన ప్రజాక్షేత్రంలో సమయం ఎంతమేర కెటాయిస్తారోనన్న విషయంపై పట్టభద్రుల్లో చర్చ సాగుతోంది.
అది సాధ్యమేనా..?
మరోవైపున అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విషయంలో అటు ప్రైవేటు విద్యా రంగంలో ఇటు ప్రభుత్వ విద్యారంగంలో అత్యంత కీలకమైన చర్చ సాగుతోంది. ఇంతకాలం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పోటీగా ప్రైవేటు విద్యా వ్యవస్థలను నడిపించిన చరిత్ర ఆయనకే దక్కుతుంది. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత ఆయన ప్రాధాన్యత ప్రైవేటుకా లేక ప్రభుత్వ విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తారా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ప్రకటించిన సందర్భంలో తాను మొదట కాలేజీలను ఏర్పాటు చేసి ఆ తరువాత స్కూళ్లను స్థాపించిన క్రమంలో చాలా మంది అనుమానం వ్యక్తం చేశారని, కాలేజీలపై నిర్లక్ష్యం చూపుతారేమెనన్న చర్చలు చేశారని, కానీ తాను వాటన్నింటిని పటపంచలు చేసి అన్ని విద్యా సంస్థలను సవ్యంగా నడిపించడంలో సఫలం అవుతున్నానని ఇదే విధానాన్ని ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత కూడా పాటిస్తానని వెల్లడించారు. అయితే తనకు సంబంధించిన విద్యా వ్యవస్థల నిర్వహణకు, రాజకీయాలను నెరపడానికి చాలా తేడా ఉంటుందన్న విషయం గుర్తు ఎరగాల్సిన అవసరం ఉంది. విద్యా రంగం అనేది ఇనిస్ట్యూట్స్ వరకే పరిమితం అవుతుటుంది కానీ రాజకీయ రంగం అనేది సమాజంలోని అన్ని వర్గాలతోనూ కలిసిపోవల్సిన ఆవశ్యకతను కల్పిస్తుంది. ప్రజలతో మమేకం కానట్టయితే ప్రతికూలతను ఎదుర్కోవల్సి వస్తుందన్నది వాస్తవం. ఇలాంటి వాతావరణంలో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎంత మేర సక్సెస్ అవుతారన్నదే కీలకంగా మారింది.