అధిష్టానం అవకాశం ఇస్తే బరిలో నిలుస్తా…
దిశ దశ, వేములవాడ:
రాజన్న సన్నిధిలో అధికార బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఇంతకాలం ఏక ఛత్రాదిపత్యంగా ఉన్న చెన్నమనేని రమేష్ బాబుకు చెక్ పడబోతోందా..? ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న మరో నేత ఏకంగా ‘క్యాంప్’ ఆఫీసు ప్రారంభించడం దేనికి సంకేతం..? బలం బలగాన్ని కూడా ప్రదర్శించే ప్రయత్నం చేసిన ఆనేత కూడా పోటీ చేస్తాననే అంటుండడంతో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది.
‘క్యాంప్’ ఆఫీసు ప్రారంభం…
వేములవాడలోని రెండో బైపాస్ రోడ్డు మల్లారం క్రాసింగ్ వద్ద చల్మెడ లక్ష్మీ నరసింహరావు వ్యక్తిగత కార్యాలయాన్ని ప్రారంభించారు. సీనియర్ నేత ప్రభాకర్ రావుచే క్యాంప్ ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ నాయకులు కూడా హాజరు కావడం గమనార్హం. వేములవాడ బరిలో చల్మెడ లక్ష్మీనరసింహరావు నిలుస్తారన్న ప్రచారం ఊపందుకున్న క్రమంలో ఆయన ఏకంగా క్యాంప్ ఆఫీసు ప్రారంభించడం విశేషం. ఈ కార్యాలయం తన వ్యక్తిగతమని ఇక్కడి ప్రజలకు కెయిమ్స్ ద్వారా సేవలందించేందుకు అందుబాటులో ఉండేందుకు దోహదపడుతుందని చల్మెడ చెప్తున్నప్పటికీ అసలు కారణం వేరేనన్న చర్చ వేములవాడలో మొదలైంది. ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పటి నుండే వేములవాడ నుండి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును కాదని మరో నాయకుడిని ఇక్కడి నుండి ఎంకరేజ్ చేస్తారా అన్న అనుమానం కూడా వ్యక్తమయింది. అయితే చల్మెడ మాత్రం చాపకింద నీరులా తన పర్సనల్ ఇమేజ్ పెంచుకుంటూ పట్టు బిగించే ప్రయత్నాల్లో ఇంతకాలం నిమగ్నం అయ్యారు. మంగళవారం ఉన్నట్టుండి క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేయడంతో తన లక్ష్యం ఏంటో చెప్పకనే చెప్పినట్టయింది.
అవకాశం ఇస్తేనే పోటీ…
చల్మెడ ఆనంద రావు ఆసుపత్రి ద్వారా వేములవాడ ప్రాంతంలో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఈ సేవలు మరింత ఎక్కువగా అందించేందుకు ఈ కార్యాలయం ఏర్పాటు చేశామని లక్ష్మీనరసింహరావు అంటున్నారు. మరోరకమైన అవకాశం ఇస్తే కూడా సేవలందించేందుకు సిద్దంగా ఉన్నానని లక్ష్మీనరసింహరావు నర్మగర్భంగా ప్రకటించారు. అయితే ఈ కార్యాలయం మాత్రం తన వ్యక్తిగతమని, పార్టీ కార్యాలయం మాత్రం కాదని తేల్చి చెప్పిన ఆయన అధిష్టానం అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. దీంతో పర్సనల్ క్యాంప్ ఆఫీసు ఏర్పాటుతో చల్మెడ తన వ్యూహాలకు పదును పెట్టి తన సత్తా చూపించే దిశగా పావులు కదుపుతున్నట్టు స్పష్టం అవుతోంది. అంతేకాకుండా ప్రారంభోత్సవానికి కూడా వేములవాడ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులను భాగస్యాములను చేయడం కొసమెరుపు.