రామన్న కారులో లచ్చన్న…

మర్మమేమిటంటా..?

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

ఆ అమాత్యుడు సొంత నియోజకవర్గంలో పర్యటించినప్పుడల్లా ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. వరసగా రెండో సారి కూడా ఇదే పద్దతిని పాటించడంతో మంత్రి అంతరంగంలో ఏముందోనన్నదే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. వేములవాడ నియోజకవర్గం విషయంలో సిట్టింగ్ ను కాదని మరో నేతకు ఆయన ప్రాధాన్యత కల్పించడానికి కారణమేంటన్న ప్రశ్నే అందరి మొదళ్లను తొలుస్తోంది.

నిన్న గాల్లో… నేడు కార్లో…

రాష్ట్ర మంత్రి కేటీఆర్ సిరిసిల్ల టూర్లో రెండోసారి కూడా చల్మెడ లక్ష్మీనరసింహరావుకు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జిల్లాలో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి వేదికపైకి వేములవాడ నుండి టికెట్ ఆశిస్తున్న చల్మెడ లక్ష్మీ నరసింహరావు, ఏనుగు మనోహర్ రెడ్డిలను వేదికపైకి పిలిచారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి వీడ్కోలు పలికిన కేటీఆర్ చల్మెడ లక్ష్మీనరసింహరావును హెలిక్యాప్టర్లో పంపించారు. ఆ రోజు కేటీఆర్ చల్మెడకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి వేములవాడలో చర్చోపచర్చలు సాగాయి. మంగళవారం సిరిసిల్ల పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ స్టేడియం ప్రారంభోత్సవం అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఈ సారి తన కారులో చల్మెడ లక్ష్మీ నరసింహరావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ ని వెంట తీసుకెళ్లారు. రెండు సార్లు సిరిసిల్ల పర్యటనల్లో మాత్రం చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు కేటీఆర్ ప్రాధాన్యత తగ్గించకపోవడం విశేషం. ఇదే వాహనంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సజయ్ ని తీసుకెళ్లడం వెనక అంతగా చర్చ కూడా జరగడం లేదనే చెప్పాలి. డాక్టర్ సంజయ్, కేటీఆర్ ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉన్నందును ఈ విషయం గురించి అంత ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కానీ వచ్చే ఎన్నికల్లో కోరుట్ల నుండి విద్యాసాగర్ రావు కు బదులుగా సంజయ్ బరిలో నిలుస్తారన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రి కేటీఆర్ డాక్టర్ సంజయ్ ని తన వెంట తీసుకెళ్లడం కూడా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. కొద్ది రోజులుగా కోరుట్ల నియోజవకర్గంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్లు కూడా కొత్త పల్లవి అందుకోవడంతో మంత్రి కేటీఆర్ తో కలిసి డాక్టర్ సంజయ్ ట్రావెల్ చేయడం సంచలనంగా మారిందని చెప్పక తప్పువు. అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న విద్యాసాగరర్ రావుకు క్యాబినెట్ లో అవకాశం రాకపోవడాన్ని దృష్టిలో పెట్టుకున్న సీనియర్లు ఈ సారి కూడా ఆయన్నే పోటీ చేయాలని కోరుతున్నారు. ఈ సారైనా మంత్రి పదవి వరిస్తుందని సీఎం ఇంటి పేరు, విద్యాసాగర్ రావు ఇంటి పేరు కల్వకుంట్ల కావడం వల్లే ప్రయారిటీ తగ్గించాల్సి వచ్చిందని, ఈ సారి గెలిస్తే ఖచ్చితంగా అధినేత కేసీఆర్ క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కోరుట్ల ప్రాంత సీనియర్ గులాభి దండు సరికొత్త పల్లవి ఎత్తుకున్న అంశం, వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినన్న రీతిలో నియోజకవర్గం అంతా కలియతిరిగిన విషయాల గురించి మంత్రి కేటీఆర్, డాక్టర్ సంజయ్ మధ్య చర్చ వచ్చే అవకాశం ఉంటుందని అంటున్న వారూ లేకపోలేదు. అయితే తండ్రి నిర్ణయానికి అనుగుణంగా డాక్టర్ సంజయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారా లేక తనకే ప్రాధాన్యం ఇవ్వమని కేటీఆర్ ముందు తన మనసులోని మాటను ఉంచుతారా అన్నది మాత్రం ఆ కారుకు మాత్రమే పరిమితం కానుందన్నది నిజం.

కవ్వింపు చర్యలా..?

మరో వైపున వేములవాడ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వెనక మంత్రి కేటీఆర్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారా అన్న చర్చ కూడా ఎమ్మెల్యే చెన్నమనేని వర్గంలో సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చేందుకే ఈ ఎత్తులు వేస్తున్నారా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చెన్నమనేని బలం ఏంటో తెలిసిన కేటీఆర్ చల్మెడను ఒప్పించే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page