11న ఛలో జంతర్ మంతర్… వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం

దిశ దశ, మంచిర్యాల:

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ఉదృతంగా చేపట్టాలని వర్గీకరణ వ్యతిరేక రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ నెల 11న వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. శుక్రవారం మంచిర్యాలలో ఛలో జంతర్ మంతర్ కార్యక్రమం విజయవంతం కోసం ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల్లో ఉండే నాయకులంతా కూడా ఈ నెల 11న వర్గీకరణకు వ్యతిరేకంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరారు. రాజ్యంగం పరిధిలో కుల గణన చేసి జనాభా ప్రాతిపదికన దామాషా పద్దతిలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా, ఉద్యోగాలకే వర్గీకరణ రిజర్వేషన్లను పరిమితం చేయకుండా చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించే విషయంతో పాటు సివిల్ సర్విసెస్ ఆఫీసర్లు, మంత్రుల విషయంలోనూ అమలు చేయాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ పొట్ట మధూకర్, నేతకాని మహార్ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు జాడి రాజేష్, వంచిత్, బహుజన్ అఘాడి రాష్ట్ర కార్యదర్శి సంబరి ప్రశాంత్, జిల్లా కార్యదర్శి మేసినేని చంద్రయ్య, జిల్లా నాయకులు జునుగూరు లక్ష్మణ్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువజన సంఘం అధ్యక్షులు పోతరాజుల అశ్విత్, జిల్లా నాయకులు దొంతుల మహేష్, కొండు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page