ఏపీ పాలిటిక్స్ లోకి పీకే టీం..? టీడీపీ అధినేతతో చర్చలు..

దిశ దశ, ఏపీ బ్యూరో:

దేశంలో పేరొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలకు పదును పెట్టేందుకు సన్నద్దం అవుతున్నారు. తాజాగా శనివారం ఏపీకి వచ్చిన పీకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్, పీకేలు ఓకె ఫ్లైట్ లో రాగా… ఇద్దరు ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్‌ గ్రీన్‌ పవర్‌ అండ్‌ ఎవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ప్రైవేట్ జెట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ చేరుకున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పీకే తనదైన వ్యూహాలతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను కూడా జనాలకు చేరవేయడంలో పీకే టీం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అయితే ప్రస్తుతం ఆంద్రప్రదేష్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పీకే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో ఆ సారి ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యూహాలకు పదును పెట్టేందుకు సమాయాత్తం అవుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ కు అనుకూలంగా పని చేసిన పీకే ఈ సారి టీడీపీతో జట్టు కట్టేందుకు ముందుకు రావడం గమనార్హం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపేందుకు సమాయత్తం కావడం సరికొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీకి వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మకు చెందిన షో టైం కన్సల్టెన్సీ బృందం కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం గమనార్హం.

You cannot copy content of this page