విచారణ తప్పదా..?
కస్టడి పిటిషన్ తెరపైకి…
దిశ దశ, ఏపీ బ్యూరో:
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలని హై కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన తరుపున వేసిన స్క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఏపీ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుపై విచారణ కొనసాగాల్సిందే తప్ప మరో గత్యంతరం లేదని తేటతెల్లం అయింది. అయితే టీడీపీ లీగల్ టీమ్ సభ్యులు దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించే అంశంపై క్లారిటీ రావల్సి ఉంది.
తెరపైకి కస్టడి పిటిషన్…
స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఏపీ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో వేసిన కస్టడీ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గురువారం విచారించిన జడ్జి హై కోర్టులో చంద్రబాబు కేసును కొట్టివేయాలని కోరుతూ వేసిన స్క్కాష్ పై విచారణ జరుగుతున్నందున కస్టడికి ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోలేమన్నారు. కస్టడి పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ తరువాత కస్టడీ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ రోజుకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది సేపటి క్రితం చంద్రబాబు నాయుడు తరుపున వేసిన స్క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ పెట్టుకున్న పిటిషన్ ను విచారించి నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి.