దిశ దశ, జగిత్యాల:
ఆధార్ కార్డులో ఫోటో మార్చి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడెనిమిది బ్యాంకులకు టోకరా ఇచ్చారు. రూ 20 లక్షల రుణాలు తీసుకున్న ఆగంతకులు జగిత్యాల జిల్లా వాసిని అడ్డంగా బుక్ చేసేశారు క్రిమినల్స్.
బయటపడిందిలా…
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన ముంజల నారాయణ (44) అనే వ్యక్తి క్రాప్ లోన్ ఇప్పించాలని జగిత్యాల పట్టణంలోని కెనరా బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంకు అధికకారులు అతని సిబిల్ గురించి వాకబు చేయగా అతను రూ. 20 లక్షల లోన్ తీసుకున్నాడని, తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్ అయ్యాడని తేలింది. దీంతో సిబిల్ పాయింట్లు లేనందున రుణం ఇవ్వమని కెనరా బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకు అధికారులు చెప్పిన విషయం విని అవాక్కయిన నారాయణ ఎలాంటి లోన్ తీసుకోని తన పేరిట రుణం ఎవరో తీసుకున్నారని అనుమానించాడు. లోన్ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా… తన ఆధార్ కార్డుపై ఫోటో మార్చి మిగతా వివరాలన్ని నారాయణకు సంబంధించినవి ఉంచారని గమనించారు. దీంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా వారు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్కడకు వెళ్లి తన గోడు చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు జగిత్యాల కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశానని నారాయణ వివరించాడు.
వెరిఫికేషన్ ఎలా..?
నారాయణ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకున్నప్పుడు కానీ, లోన్ తీసుకునేప్పుడు కానీ అతని మొబైల్ నంబర్ కు ఓటీపీ నంబర్ రాకుండా అగంతకులు ఏం చేశారన్నదే మిస్టరీగా మారింది. ఆయన రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ రాకుండా అయితే సవరణలు చేసే అవకాశం ఉండదు. ఒక వేళ అగంతకులు ఆధార్ కార్డు కాంటాక్ట్ నంబర్ మార్చి తమ నెంబర్ చేర్చుకున్నట్టయితే ఇప్పుడు బాధితుడు నారాయణకు లోన్ డబ్బులు కట్టాలని ఆయా బ్యాంకుల నుండి కాల్స్ వస్తుండడం గమనార్హం. అయితే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటే ఒక సారి మాత్రమే ఆథరైజ్డ్ ఆధార్ కార్డ్ సెంటర్ లో సవరణలు చేయాల్సి ఉంటుంది. రెండో సారి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు. ఒక వేళ ఆధార్ కార్డును మాత్రమే అగంతకులు దొరకబట్టుకుని ఫోటోను మార్చినా ఆయా బ్యాంకుల ద్వారా కమ్యూనికేషన్ అంతా కూడా కార్డు హోల్డర్ కాంటాక్ట్ నంబర్ కే వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రుణం తీసుకునేప్పుడు లేదా క్రెడిట్ కార్డులు తీసుకున్నప్పుడు కూడా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీతో పాటు ఇతరాత్ర సమాచారాన్ని సంబంధిత బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు షేర్ చేస్తుంటాయి. ఆన్ లైన్ వెరిఫికేషన్ చేసిన తరువాత రుణాలు కానీ, క్రెడిట్ కార్టులు కాని సాంక్షన్ చేస్తుంటాయి. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ కు పోస్టు ద్వారా కూడా డాక్యూమెంట్లు, కార్డులు పంపిస్తుంటారు. ఇవన్ని కూడా భాదితుడు నారాయణతో సంబంధం లేకుండా ఎలా వ్యవహరించారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగాలన్న ఆథరైజ్డ్ ఆధార్ సెంటర్ లో సదరు వ్యక్తి వేలి ముద్రలను కూడా టాలీ చేసిన తరువాతే సవరణలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నారాయణకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఫోటోను మార్చడం ఎలా సాధ్యం అయిందన్నదే పజిల్ గా మారింది. ఫోటో మార్చేప్పుడు కూడా ఆధార్ కార్డు హోల్డర్ ఖచ్చితంగా ఐరీష్ కెమరాలో ఫోటో దిగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆన్ లైన్ లో ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకున్నట్టయితే ఆధార్ సెంట్రల్ ఆఫీస్ ప్రత్యేకంగా పాస్ వర్డ్ కూడా కెటాయిస్తుంది. ఆ పాస్ వర్డ్ అగంతకులకు ఎలా దొరికింది అన్నది మిస్టరీగా మారింది.
ఫిజికల్ వెరిఫికేషన్…
బాధితుడు నారాయణ చెప్తున్న సమాచారాన్ని బట్టి ప్రైవేటు బ్యాంకులే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా అగంతకులు రుణాలు తీసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. మొత్తం ఏడు నుండి ఎనిమిది బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని, రూ. 20 లక్షల వరకు అంగతకులు డ్రా చేసుకున్నారని చెప్తున్నారు. అయితే ఆయా బ్యాంకులు కూడా బెనిఫిషర్ కు రుణాలు ఇచ్చేప్పుడు సిబిల్ పాయింట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఫిజికల్ వెరిపికేషన్ కూడా చేస్తుంటాయి. ఇందుకు ఆయా బ్యాంకుల్లో పని చేస్తున్న పీల్డ్ ఆఫీసర్లు కానీ, లోన్లకు సంబంధించిన ప్రాసెస్ చేసే ఏజెన్సీలు కానీ క్షేత్ర స్థాయి పరిశీలన చేయడంతో పాటు అతని ఆదాయ మార్గాలను కూడా ఆరా తీసే విధానం ఉంటుంది. అప్పుడు కూడా నారాయణకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశారన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు సంబంధించిన ఆదాయ మార్గాలు, ఆస్తులకు సంబంధించిన సర్టిఫైడ్ డాక్యూమెంట్లను కూడా ఆయా సంస్థలు పరిశీలించిన తరువాత లోన్ ఇవ్వాల్సి ఉంటుంది. నారాయణ పేరిట ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లను అగంతకులు బ్యాంకుల్లో ఇచ్చిన డాక్యూమెంట్లు ఎలా క్రియేట్ చేశారో కూడా అంతు చిక్కకుండా పోతోంది. ఏది ఏమైనా జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన నారాయణకు జరిగిన అన్యాయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది.