అంచనాలు తలకిందులు..
దిశ దశ, జగిత్యాల:
తెలంగాణ రాజకీయాల్లో శరవేగంగా సమీకరణాలు మారుతున్నాయి. అంచనాలు తలకిందులు చేస్తూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్య నేత ఫ్యామిలీ కుటుంబానికే ఆత్మీయులు కూడా ప్రత్యర్థి పార్టీలోకి జంప్ చేస్తున్నారు. దీంతో ఊహించని విధంగా చోటు చేసుకుంటన్న పరిస్థితులు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీకి మింగుడుపడకుండా పోయాయి.
జగిత్యాల ఎమ్మెల్యే…
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ భీష్ముడిగా పేరొందిన జీవన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా స్వరాష్ట్ర కల సాకారం కాకముందు నుండి పావులు కదుపుతున్నారు. 2014లో ఓటమి చవి చూసినప్పటికీ ఆ తరువాత రెండు ఎన్నికల్లో కూడా తన పంథాన్ని నెగ్గించుకున్నారు కవిత. 2018, 2023 ఎన్నికల్లో జగిత్యాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి జీవన్ రెడ్డిపై గెలిచిన డాక్టర్ ఎం సంజయ్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న చర్చల్లో ఎక్కడా కూడా డాక్టర్ సంజయ్ పేరు వినిపించలేదు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీకి కూడా సన్నిహితునిగా… సౌమ్యూనిగా ముద్రపడ్డ డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయించడం సరికొత్త చర్చకు దారి తీసింది.
ప్రత్యర్ధులు ఇద్దరు…
జగిత్యాల ముఖ చిత్రాన మరో పరిణామం చోటు చేసుకుంది. హ్యాట్రిక్ ప్రత్యర్థులు ఇద్దరు కూడా ఒకే గూటికి చేరినట్టయింది. 2014 ఎన్నికల నుండి ఇప్పటి వరకు జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డాక్టర్ సంజయ్, జీవన్ రెడ్డి ఇద్దరే ప్రధాన ప్రత్యర్థులు. అయితే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గూటిలో చేరడంతో ప్రత్యర్ధులిద్దరు ఒకే గూటికి చేరినట్టయింది.
ఒకే ఒరలో…
మరో వైపున నిన్న మొన్నటి వరకు విమర్శలు చేసుకున్న ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో చేరడంతో ఒక ఒరలో రెండు కత్తులు ఇమిడేనా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా వరసగా రెండు సార్లు ఓడించిన డాక్టర్ సంజయ్ ఇప్పుడు తాను ఉన్న పార్టీలో చేరడాన్ని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఎలా స్వాగతిస్తారోనన్న చర్చ మొదలైంది. ఇటీవల పట్టణంలో అక్రమ నిర్మాణాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు లేఖ రాయగా, దీనికి కౌంటర్ గా డాక్టర్ సంజయ్ కూడా నివాసాలకు అనుమతులు తీసుకుని కమర్షియల్ బిల్డింగులు నిర్మించారని, అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపిన తరువాత ఇంటి నంబర్లు ఇచ్చారని ఆరోపించి, ఈ వ్యవహారంపై కూడా విచారణ జరపాలని కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరు నాయకులు రాజకీయంగా ఎత్తుకు పైఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. అయితే తాజాగా ప్రత్యర్థి పార్టీకి చెందిన డాక్టర్ సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జగిత్యాల పాలిటిక్స్ ఎలా సాగుతాయోనన్నదే హాట్ టాపిక్ గా మారింది.