కరీంనగర్ వీధుల్లో రంగు మారిన ప్రచారం…

దిశ దశ, కరీంనగర్:

నిన్నటి మొన్నటి వరకు వీధులన్ని గులాభి మయమై కనిపించేవి. ప్రతి నాయకుడి మెడలోనూ  ఆ పార్టీ కండువా దర్శనమిచ్చేది. గులాభి జెండాలు రెపరెపలాడిన ఆ ప్రాంతాల్లో కండువాలు రంగు మారిపోయి కనిపిస్తున్నాయి. కారు గుర్తుకే మన ఓటు అని నినదించిన వారి నోట హస్తం మన నేస్తం అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం ఉద్యమ పార్టీతో జై కొట్టిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కరీంనగరంలో ప్రచారం తీరే మారిపోయింది. కరీంనగర్ బల్దియాలో బలమైన పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ క్రమక్రమంగా కనుమరుగవుతోంది. లోకసభ ఎన్నికల వేళ కారు దిగిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాదు కార్యరంగంలోకి దిగి ప్రచారం కూడా ప్రారంభించారు. దీంతో నగరంలోని ఆయా వీధుల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూల ప్రచారానికి బ్రేకులు పడగా…  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించడం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కరీంనగర్ పై దృష్టి సారించినప్పటికీ పార్టీ మారుతున్న నాయకులు మాత్రం తమదారి తాము చూసుకుంటున్నామని చేతల్లోనే చెప్పేస్తున్నారు. ఇంతకాలం నామమాత్రంగా వినిపించిన జై కాంగ్రెస్ నినాదాలు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మారుమోగుతున్నాయి. కార్పోరేటర్లు, వారి భర్తలతో పాటు పలువురు నాయకులు కూడా ఉద్యమ పార్టీకి బైబై చెప్పి… కాంగ్రెస్ పార్టీకి జైజై అంటున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ బల్దియాలోని 60 డివిజన్లలో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు. దీంతో కరీంనగర్ కార్పోరేషన్ లో ఆ పార్టీ ఉనికే లేకుండా పోయింది. ఆయా డివిజన్లకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ నగరంలో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పోరాటాలు చేసినప్పటికీ డివిజన్లపై పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోయింది. కానీ తాజాగా లోక సభ ఎన్నికల నేపథ్యంలో 11 మంది కార్పోరేటర్లతో పాటు ఒకరిద్దరు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పరిస్థితిలో మార్పు వచ్చినట్టయింది. ఆయా డివిజన్లలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేపట్టడంతో గులాభి జెండాలకు బదులు కాంగ్రెస్ కండువాలు దర్శనమిస్తున్నాయి.

అన్నింటా నష్టమే…

కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ప్రతికూలతను ఎదుర్కొంటున్న తీరు చర్చనీయాంశంగా మారింది. కీలకమైన నాయకత్వం కనుసన్నల్లో మెదిలి వారి అండదండలతో ఏక చత్రాధిపత్యం చెలాయించిన వారిలో కొంతమంది పార్టీని వీడడం బీఆర్ఎస్ పార్టీ వర్గాలను విస్మయ పరుస్తోంది. ముఖ్య నాయకుల సహకారంతో తమకు నచ్చిన విధంగా వ్యవహారాలను చక్కబెట్టుకున్న వారు కూడా పార్టీని వీడుతున్న తీరుపై పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో అలా అధికారం కోల్పోయిన నెలల వ్యవధిలోనే ఆశీస్సులు అందించిన నేతను కాదని ఇతర పార్టీ వైపు చూస్తున్న తీరుకు కారణమేంటన్నదే మిస్టరీగా మారింది. సదరు నేత అండదండలు ఉన్న వారు పార్టీని వీడుతుంటే… మరో వైపున తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని నైరాశ్యంలో కొట్టుమిట్టాడిన వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అటు అక్కున చేర్చుకున్న వారు… ఇటు దూరంగా ఉన్న వారు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇంటా బయటా తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఏది ఏమైనా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిణామాలు మాత్రం అన్ని వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి.

You cannot copy content of this page