దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణాలో అడవిబాట్ట పట్టి అసువులు బాసిన నక్సల్స్ విషయంలో పొలిటికల్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరుతో ట్రెండ్ మారినట్టే కనిపిస్తోంది. తుపాకిగొట్టం ద్వారానే రాజ్యాధికారం అని నినదించిన అన్నలు మరణిస్తే ఇంతకాలం అటువైపు కన్నెత్తి కూడా చూడని రాజకీయ నాయకులు ఇప్పుడు నివాళులు అర్పిస్తుండడం సరికొత్త సాంప్రాదాయానికి తెరతీసినట్టయింది. అధికార పార్టీ నాయకులు కూడా నక్సల్స్ మృతిపట్ల సంతాపం ప్రకటిస్తుండడంతో నయా ట్రెండ్ మొదలైనట్టు స్పష్టమవుతోంది. అజ్ఞాతంలో ఉంటూ రాజ్యానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టి మరణించిన నక్సలైట్లకు నివాళులు అర్పించే సంస్కృతి ప్రారంభం కావడం తెలంగాణాలో సాగుతున్న సరికొత్త పంథాగా మారిపోయింది.
కటుకం మృతితో..
మావోయిస్టు పార్టీ ముఖ్యనేత కటుకం సుదర్శన్ అనారోగ్యంతో చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో గత సంవత్సరం మరణించారు. ఆనంద్ మరణించిన విషయాన్ని మావోయిస్టు పార్టీ ప్రకటించిన తరువాత విప్లవ భావజాలం ఉన్న వారితో పాటు సుదర్శన్ గురించి తెలిసిన వారంతా కూడా బాధపడ్డారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన సుదర్శన్ చనిపోయిన తరువాత ఆయనకు నివాళులు అర్పించారు బెల్లంపల్లి వాసులు. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కటుకం విప్లవపంథా వైపు వెల్లిన తీరును కొనియాడారు.
అన్నె సంతోష్….
అయితే ఇటీవలే కాంకేర్ పూజార్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌటర్ లో మరణించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దస్తగిరిపల్లికి చెందిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ మరణించినప్పుడు మాత్రం స్థానికులు మాత్రమే నివాళులు అర్పించారు. బంధుమిత్రుల కమిటీ, ఆయన కుటుంబ సభ్యులు స్మారక స్థూపం ఆవిష్కరించారు.
మంత్రి సీతక్క…
ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు పార్టీ నేతకు రాష్ట్ర మంత్రి సీతక్క నివాళులు అర్పించారు. ఇటీవల చత్తీస్ గడ్ లోని కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ కూడా మరణించారు. బుధవారం చల్లగరిగె గ్రామానికి వెల్లిన మంత్రి సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు శంకర్ కు నివాళులు అర్పించడంతో పాటు ఆయన తల్లిని కూడా పరమార్శించారు. సాక్షాత్తు ఓ మంత్రి అజ్ఞాత జీవితంలో ఉంటూ ఎన్ కౌంటర్ లో మరణించిన వ్యక్తికి క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి సంతాపం తెలపడం సచంలనంగా మారింది. ఒకప్పుడు విప్లవ పంథాలో వెల్లి చనిపోయిన వారి గురించి పట్టించుకోని పొలిటికల్ లీడర్లు ఇప్పుడు మాత్రం బాహాటంగానే నివాళులు అర్పిస్తుండడం విశేషం.
అప్పట్లో…
1990వ దశాబ్దంలో పీపుల్స్ వార్ కు చెందిన హేమ్ చందర్ ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మంథని సమీపంలోని అరెందలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెల్లిన అప్పటి స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వెల్లారు. గ్రామస్థులు హేమ చందర్ ఎన్ కౌంటర్ లో మరణించిన విషయాన్ని తెలియజేయడంతో అక్కడి నుండే సంతాపం ప్రకటించారు. ఈ విషయం పత్రికల్లో రాగానే పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే ఇప్పుడు మాత్రం అడవి బాట పట్టి చనిపోయిన వారికి సంతాపం తెలపడం సాధారణ విషయంగా మారిపోవడం గమనార్హం.
పోలీసులు అలా…
ఇకపోతే విప్లవ పంథాలో సాగుతున్న అజ్ఞాత నక్సల్స్ జనజీవనంలో కలవాలని పోలీసులు పిలుపునిస్తున్నారు. తాజాగా రామగుండం సీపీ ఎం శ్రీనివాస్ తో పాటు పోలీసు అధికారులు ప్రత్యేకంగా పోస్టర్లను కూడా విడుదల చేశారు. అడవి బాటను వీడి ప్రజాస్వామ్య బద్దంగా జనజీవనంలో కలవడమే కాకుండా చట్టసభలకు ఎన్నికై పోలీసుల నుండి గౌరవం పొందుతున్న విషయాన్ని గమనించి బాహ్య ప్రపంచంలోకి రావాలని కూడా పిలుపునిచ్చారు. రాజకీయాల్లో చేరి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. అయితే రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు మాత్రం అజ్ఞాతంలో ఉంటూ మరణించిన వారికి సంతాపాలు ప్రకటిస్తుండడం విశేషం.