ఒకరి మృతి… పోలీసుల ఎంట్రీ
దిశ దశ, చెన్నూరు:
గలగల పారే గోదావరి తీరంలో మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. గోదావరి నీటి సవ్వడుల శబ్దాలకు తాంత్రిక పూజలు, మంత్రతంత్రాలు వెలుగులోకి రావనుకున్నారో ఏమో తెలియదు కానీ అక్కడ మాత్రం అవే రాజ్యమేలాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలో జరిగిన ఈ ఘటన పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి వచ్చింది. చెన్నూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనిపై గిట్టని వారు తాంత్రిక ప్రయోగం చేశారని భావించిన కుటుంబ సభ్యులు ఓ మాంత్రికుడిని సంప్రదించారు. ఆదివారం చెన్నూరు సమీపంలో… చెట్లు, పొదల మధ్య తాంత్రిక పూజలు చేశారు. ఈ మంత్రాలు వికటించడంతో సదరు బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి… సాధారణ మరణం సంభవించినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. సోమవారం అంతిమ సంస్కారం చేస్తున్న క్రమంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అంత్యక్రియలు నిలిపివేసి… పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై చెన్నూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.