పోలీసుల ఛేజింగ్… సినిమాను తలపించిన చోరీ

ఓ మూవీలో చైన్ స్నాచింగ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు ఆడ వాళ్ల వేషం వేసి పట్టుకుంటున్న క్రమంలో పోలీసులకే వేణు మాధవ్ ను ఝలక్ ఇస్తాడు. దీంతో చోరీకి గురైన వాహనాన్ని పట్టుకునేందుకు ఛేజ్ చేయాల్సి వచ్చింది హీరో అల్లరి నరేష్ కు. రన్నింగ్ లో టాపర్ గా నిలిచిన నరేష్ తనకు స్పోర్ట్స్ కోటాలో ఎస్సై ఉద్యోగం సంపాదించానని నిన్ను పట్టుకోవడం పెద్ద లెక్క కాదు కదా అన్న రీతిలో దొంగకు చేతల్లోనే సమాధానం చెప్తాడు. అయితే ఈ సన్నివేశంలో నరేష్ పరిగెత్తుతుంటే ఆ వేగానికి రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డులు కిందపడి పోవడం, ఒకరి తలపై ఉన్న విగ్గు ఎగిరిపోవడం, కారు నడుపుకుంటున్న ఓ భర్త తన భార్యతో పెళ్లికి ముందు హెవీ స్పీడ్ గా నడిపేవాడినని ఇప్పుడు నడిపే స్పీడ్ ఓ లెక్కా అంటూ సమాధానం చెప్తున్న క్రమంలోనే నరేష్ పరిగెత్తుకుంటూ ఆ కారును ఓవర్ టేక్ చేస్తున్న సీన్ ను కూడా చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే తెలంగాణాలో చోటు చేసుకుంది.. దొంగతనానికి గురైన వాహానాన్ని పట్టుకునేందుకు పోలీసులు సినిమా స్టైల్లో రన్నింగ్ చేయనప్పటికీ వారి మెదళ్లకు పని పెట్టారు… సాంకేతికతను అందిపుచ్చుకుని… ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అలెర్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. సూర్యపేట జిల్లాకేంద్రంలో చోటు చేసుకున్న అత్యంత విచిత్రమైన ఈ కేసు పూర్వా పరాలిలా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే…

సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన TS 09 PA 0658 ఇన్నోవా వాహనం కొత్తబస్టాండ్ వద్ద చోరీకి గురైంది. గురువారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. సూర్యపేటలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఓ కేసు దర్యాప్తులో భాగంగా వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేసి ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దిగారు. అయితే ఇన్నోవాలో వెల్లిన పోలీసులు వాహన కీ కూడా వదిలేసి వెల్లారు. అదే సమయంలో అటుగా వెల్తున్న అగంతకుడు ఒకరు ఇన్నోవాను గమనించి దర్జాగా స్టార్ట్ చేసుకుని వెల్లిపోయాడు. తీరా పార్క్ చేసిన చోటకు వచ్చే సరికి ఇన్నోవా కనిపించకపోవడంతో పోలీసులు అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు. దీంతో కోదాడ సమీపంలో ఇన్నోవాను, అగంతకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఓ కేసు దర్యాప్తు కోసం వెల్తే మరో కేసు బుక్ చేయాల్సిన పరిస్థితి ఎదురు కావడం ఓ ట్విస్ట్ అయితే… నేరాల నియంత్రణలో తలమునకలయ్యే పోలీసుల వాహనాన్నే ఎత్తుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

అజాగ్రత్తే కారణమా..?

అయితే సాధారణంగా పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా అప్రమత్తం చేస్తుంటారు. వరసగా సెలవులు వచ్చాయంటే చాలు చాలా మంది ఫ్యామిలీతో టూర్లకు వెల్తుండడం పరిపాటి. ఈ సమయంలో ప్రజలు ఇళ్లకు తాళం వేసినప్పటికీ ఇరుగు పొరుగు వారికి చెప్పాలని, తమకూ సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తుంటారు. తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసే దొంగల ముఠాలు ఇంట్లోకి చొరబడివ ఉన్నవన్ని ఊడ్చుకపోతారని పోలీసులు దశాబ్దాలుగా సామాన్యులను అప్రమత్తం చేస్తుండడం కామన్. అయితే సూర్యపేట టౌన్ పోలీసులు మాత్రం పోలీసు వాహనం అని రాసి ఉందని తెలిసి ఎలా ఎత్తుకెల్తారన్న ధీమాతో వదిలేశారో లేక అజాగ్రత్తగా వ్యవహరించారో తెలియదు కానీ ఏకంగా ఇన్నోవా కీస్ కూడా వాహనంతో పాటే వదిలేసి పోవడం విస్మయానికి గురి చేస్తోంది. అందరినీ అప్రమత్తంగా ఉండాలని చెప్పే పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటోనన్న ప్రశ్న తలెత్తుతోంది.

అగంతుకుని అత్యుత్సాహం…

ఇకపోతే ఈ వ్యవహారంలో చోరీకి పాల్పడిన అగంతకుడి తీరు కూడా అందరినీ విస్మయపరుస్తోంది. ‘నఖల్ మార్నే వాలేకు బీ అఖల్ రైనా’అంటుంటారు. నఖలు కొట్టే వాడికి కూడా తెలివి ఉంటేనే సాధ్యం అవుతుందనేది ఈ సామెత అర్థం. అసూర్యపేటలో పోలీసు ఇన్నోవాను ఎత్తుకెళ్లిన దొంగకు తెలివి లేదన్నది తేటతెల్లం అవుతోంది. భారీ సైజు అక్షరాల్లో పోలీసు వాహనం అని రాసి ఉండడంతో పాటు ఇతరాత్ర అన్ని ఇండికేషన్స్ కూడా పోలీసు వెహికల్ అని స్ఫష్టంగా ఏర్పడుతున్నది. అలాంటి వాహనాన్ని ఎత్తుకెళ్లడం, హైవేపైనే ప్రయాణించడం చివరకు కోదాడ వద్ద పోలీసులకు పట్టుబడడం చూస్తుంటే దొంగ ఎంతటి తెలవి మంతుడో అర్థం అవుతోంది. అయితే దొంగకు చెప్పే గతి అన్న నానుడికి తగ్గట్టుగా కూడా వ్యవహరించారని అంటున్న వారూ లేకపోలేదు. చోరీకి పాల్పడేందుకు వచ్చిన వ్యక్తికి ఏమీ దొరకకపోతే చివరకు చెప్పులు దొరికినా ఎత్తుకెల్తాడని ప్రచారంలో ఉంది. సూర్యపేటలో వింత దొంగ వ్యవహరించిన తీరు ఇలాగే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు కొందరు. ఏది ఏమైనా ఓ పోలీసు వాహనం చోరీ జరగడం వల్ల పోలీసులను అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరించినట్టయింది.

You cannot copy content of this page