దిశ దశ, భూపాలపల్లి:
నిరుద్యోగుల ఆశలను ఆసరాగా తీసుకుంటున్న అక్రమార్కులు వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి కల్పిస్తామంటు డబ్బులు వసూలు చేసి అమాయకులను నిండా ముంచేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు ఉద్యోగాల పేరిట చీటింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్ పోస్టులకు కాంట్రాక్టు పద్దతిలో నియామకాలు జరుగుతున్నాయని, ఔట్ సోర్సింగ్ కంట్రాక్టు పద్దతి తమకు వస్తోందని చెప్పి మోసానికి పాల్పడ్డారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన నిరుద్యోగుల నుండి రూ. 2 లక్షల చొప్పున ఒక్కొ ఉద్యోగానికి చెల్లించాలని చెప్పి రూ. 60 లక్షల వరకూ వసూలు చేశారు. కొద్ది రోజుల పాటు ఉద్యోగాలు కల్పించినట్టుగా డ్యూటీలు చేయించి జీతాలు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగడం మొదలు పెట్టారు నిందితులు. దీంతో నిందితుడు ఒకరిని పట్టుకుని నిరుద్యోగులు నిలదీయగా కొంతమందికి డబ్బులు తిరిగి ఇచ్చాడని, మిగతా వారికి చెక్కులు ఇచ్చాడు. బ్యాంకు అకౌంట్లో డబ్బు లేకపోండంతో చెక్కులు క్లియర్ కాలేదు. దీంతో బాధిత నిరుద్యోగులను నిందితులు కలెక్టరేట్ సమీపంలో చితకబాది బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఘనపూర్ మండలవ గాంధీనగర్ కు చెందిన దొంగల చందు అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కరీంనగర్ కు చెందిన గుర్రం శ్రీనివాస రావు (41), భూపాలపల్లి జిల్లా సుభాష్ కాలనీకి చెందిన సన్నాయిల సుభాష్, కాసింపల్లికి చెందిన మోకిడి అశోక్ లను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి బ్యాంకులకు చెందిన చెక్కులు, ఒక కారు సీజ్ చేసినట్టు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడిన ముఠాను పట్టుకోవడంలో డీఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్, సీసీఎస్ ఎస్ఐ లు ప్రసాద్, సుధాకర్, రమేష్, హెడ్ కానిస్టేబుల్ సదానందం, కానిస్టేబుళ్లు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, రాంబాబులను ఎస్పి కిరణ్ ఖరే ప్రత్యేకంగా అభినందించారు.