ఫేజ్ బుక్ పేజీ ద్వారా ప్రమోషన్…
మల్టిలెవర్ మార్కెట్ తో కొత్త అవతారం
రమేష్ చారా మజాకా..?
దిశ దశ, కరీంనగర్:
ఐదేళ్ల క్రితం ఉద్యోగాల పేరిట టోకరా ఇచ్చి 15 నెలల పాటు పీడీ యాక్టులో జైలు జీవితం అనుభవించాడా క్రిమినల్. రెండు కేసుల్లో శిక్ష కూడా అనుభవించినా తన నైజాన్ని మాత్రం మార్చుకోలేదు. కొత్త తరహా మోసానికి పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల వారిని నిండా ముంచాడు. మల్టిలెవల్ మార్కెటింగ్ పేరిట మోసం చేసిన రమేష్ చారిని అరెస్ట్ చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడు చేసిన నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో స్థానిక డీఎస్సీ ఉదయ్ రెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్ లు కూడా పాల్గొన్నారు.
ఎరగా వేసి…
మన తెలంగాణ ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ పేరిట పేజీ క్రియేట్ చేసిన రమేష్ చారీ కంపెనీ ధరలకన్నా తక్కువ ధరకే వస్తువులు అమ్ముతానంటూ ప్రచారం చేశాడు. ఇతని వలలో పడ్డ వారికి మొదట తక్కువ ధరకే వస్తువును విక్రయించాడు. మార్కెట్ ధర కన్నా 30 నుండి 40 శాతం తక్కువే ఇస్తుండడంతో రమేష్ చారీ వలలో చాలా మంది పడిపోయారు. మొదట ఎరగా వేసి ఆ తరువాత జనాలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడీ కేటుగాడు. 2021లో స్టార్ట్ చేసిన ఈ వ్యాపారంతో ఇప్పటి వరకు రూ. 9.50 కోట్ల వరకూ లావాదేవీలు చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. విజయవాడకు చెందిన ఓ బాధితురాలి వద్ద రూ. 1.50 కోట్లు వసూలు చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే రూ. 3 నుండి 4 కోట్ల మేర లావాదేవీలు చేసినట్టుగా గుర్తించారు. అయితే రమేష్ చారీ బాధితులు మరింత మంది ఉన్నారని కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇతని వలలో రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు కరీంనగర్, హైదరాబాద్, అనంతపూర్ తదితర ప్రాంతాలకు చెందిన వారూ కూడా ఉన్నారని గుర్తించారు. అతని బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేయించామని, అయితే అందులో రూ. 30 వేలు మాత్రమే ఉన్నాయి. మిగతా డబ్బు ఏం చేశాడు..? వాటితో ఏమైనా ఆస్థులు కొనుగోలు చేశాడా, నగదు దాచి పెట్టాడా అన్న కోణంలో ఆరా తీయాల్సి ఉందని, పూర్తి స్థాయిలో విచారించేందుకు కోర్టులో కస్టడి పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
మొబైల్ వాడకున్నా…
సాంకేతికతను అందిపుచ్చుకుని పోలీసులు నిందితులను పట్టుకుంటున్నారన్న విషయాన్ని పసిగట్టిన రమేష్ చారీ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మోబైల్ ఫోన్ కూడా వాడడం మానేశాడు. నెల రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసు నమోదు కాగా నిందితున్న పట్టుకునేందుకు ఓ ఆర్ ఎస్ఐని రంగంలోకి దింపి సఫలం అయ్యారు. టెక్నాలజీ సహకారం లేకుండానే నిందితుని ఆచూకి దొరకబట్టుకుని మరీ అరెస్ట్ చేశారు.
ఇలాంటివి నమ్మొద్దు: ఎస్పీ అఖిల్ మహాజన్
మల్టిలెవల్ మార్కెటింగ్ నిర్వహాకులకు చేసే మోసాలను నమ్మి వారి వలలో చిక్కుకోవదన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. తక్కువ ధరకు వస్తువులు ఇస్తానని ప్రకటించి మొదట తక్కువ ధరలో ఉన్న వస్తువుల విక్రయించి ట్రాప్ లో పేడేసుకుంటారని, ఆ తరువాత పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుకుని ముంచుతారని ఎస్సీ వివరించారు. అంతే కాకుండా తక్కువ ధరకు వస్తువుల విక్రయం గురించి ఒకరి నుండి మరోకరికి ప్రచారం జరగడంతో అతని వలలో చిక్కుకున్నారన్నారు. అయితే రమేష్ చారీ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, ఇప్పటికే ఇతనిపై 19 కేసులు నమోదయ్యాయని కూడా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు.