ఒక్క ఫోన్ కాల్ తో ‘ఆధార్’ సమస్యలకు చెక్

దాదాపు ప్రతి భారతీయుడు దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. ఉండి తీరాల్సిందే. దీనిని ప్రభుత్వం ఎప్పుడో తప్పనిసరి చేసింది కూడా. పాన్ కార్డు కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా, ఇతర ట్రాన్సాక్షన్లు చేయాలన్నా, ప్రభుత్వ ప్రయోజనాలను అందుకునేందుకు లబ్ధిదారుడు కావాలాన్నా ఆధార్ కార్డు అనేది అత్యంత అవసరం. గుర్తింపు కార్డుగా కూడా ఈ ఆధార్‌నే ప్రథమ ప్రాధాన్యంగా గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక అలాంటి ఆధార్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవడం మన బాధ్యత. పేరు, పుట్టిన తేదీ, ఇంటి పేరు, లింగం, చిరునామా ఇలా ఏ తప్పు ఉన్నా.. చిక్కుల్లో పడిపోతాం. వాటిని కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాల్సిందే. అయితే.. ఇదెలా చేసుకోవాలో తెలుసుకోలేకపోతున్నారా? ఆధార్ కార్డుకు సంబంధించి ఇంకా ఏదైనా సందేహం ఉందా? అన్నింటికీ ఇక చిటికెలో తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డులో తప్పులు, అప్‌డేట్లకు పరిష్కారం దగ్గర్నుంచి.. ఇతర ఏ సందేహం ఉన్నా.. జస్ట్ ఒక్క నంబర్‌కు ఫోన్ చేస్తే అన్నీ వారే తీరుస్తారు. అందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకొచ్చింది. ఈ నంబర్‌కు కాల్ చేసి మీ అనుమానాలు అడగొచ్చు. ప్రతినిధులు పరిష్కారం చెబుతారు. ఆ ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ 1947. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం కాబట్టి అందరికీ సులభంగా గుర్తుండేలా ఈ నంబర్‌ను తీసుకొచ్చినట్లు చెబుతారు. ఈ నంబర్‌కు కాల్ చేస్తే UIDAI ప్రతినిధులు మీతో మాట్లాడతారు. ఇది టోల్ ఫ్రీ నంబర్. దీనికి ఎలాంటి ఛార్జీలు పడవు. మొత్తం 12 భాషల్లో ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. హిందీ, ఉర్దూ, తెలుగు, కన్నడ, తమిళం, పంజాబీ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఒరియా, అస్సామీ భాషల్లో రిప్రజెంటేటివ్స్ బదులిస్తారు. ఇక సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు వారు అందుబాటులో ఉంటారు. ఆదివారం రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారు మీ కాల్స్‌ను స్వీకరిస్తారు. మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ కేంద్రాల వివరాలు, ఆధార్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ స్టేటస్, ఆధార్ కార్డు డెలివరీ స్టేటస్, అప్‌డేట్లకు సంబంధించి ఏ సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది. ఇంకా మీ ఆధార్ దుర్వినియోగానికి సంబంధించి ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చు. ఇక ఆధార్ కార్డు సమస్యల్ని emailhelp@uidai.gov.in కు మెయిల్ చేసి కూడా పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇక UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఉండనే ఉంది.

You cannot copy content of this page