బలగం చూసిన ‘చీల’ బలగం…

ఒకే కుటుంబంలో జన్మించిన ఆ వారసులంతా ఉపాధి కోసమో… ఉద్యోగం కోసమో… వ్యాపారం కోసమో… వేర్వేరు ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. ఆధునికత ముసుగేసుకుని నేను, నా కుటుంబమని గిరి గీసుకుని బ్రతుకుతూ కాలం వెల్లదీస్తున్న చాలామంది జీవన విధానానికి పూర్తి భిన్నంగా ఉంటుందీ ఫ్యామిలీ. ఎవరెక్కడికెళ్లినా..? ఏ స్థాయికి చేరుకున్నా మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వారమన్న భావన మాత్రం వారిలో నేటికీ ఏ మాత్రం తగ్గలేదు. క్షణంలోనే వైషమ్యాలను కొని తెచ్చుకుంటున్న ఈ కాలంలోనూ అప్యాయత… అనురాగాలను పంచుకునేందుకే వారు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. అందుకే ఏ పర్వదినం అయినా… ఏ వేడుక జరిగినా అందరు సొంతూరికి చేరుకుని సంబరాలు చేసుకుంటారు. ఆ సమయంలో వారి ఆనందాలు అంబరాన్ని తాకితే… పెద్దలను చూసి పిల్లలూ కూడా ప్రేమను పంచుతూ బ్రతకడం నేర్చుకుంటున్నారు. స్వార్థపూరితంగా మారిన కొందరు, ఆర్థిక అసమానత్వపు జాడ్యంలో కొట్టుమిట్టాడుతున్న ఇంకొందరు రక్తం పంచుక పుట్టిన వారినే వెలివేస్తున్న ఘనులనూ మనం కళ్లారా చూస్తున్నాం. అవసరం తీరిన తర్వాత అధ: పాతాళంలోకి తొక్కేయాలనుకునే కొన్ని కుటుంబాలకు చెందిన వారికి పక్కా ఈ ఫ్యామిలీ ఆదర్శంగా నిలుస్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటేనే అదేంటని ప్రశ్నించే నేటి సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారీ కుటుంబ సభ్యులు.

ఎక్కడి వారో..?

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ‘చీల’ కుటుంబ సభ్యుల జీవన విధానమే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాలి. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఫంక్షన్లు, ఫెస్టివల్స్ కు కంపల్సరి తమ ఇంటి ముందు వచ్చి వాలిపోతుంటారు. ఇలా ప్రతి వేడుకకు, పర్వదినానికి వచ్చినప్పుడు అందరూ కలిసి తమ కుటుంబ సాన్నిహిత్యపు పరిమళాలను పంచే ప్రయత్నం చేస్తుంటారు. అందరం కలిశాం కదా… ఈ ఆనందాన్ని శాశ్వతంగా మదిలో దాచుకునే విధంగా ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రాం చేయాలనుకుంటారు వీరంతా. అందుకే ఎప్పుడు ముదిమాణిక్యం వచ్చినా ‘చీల’ ఫ్యామిలీ మెంబర్స్ చేసే అనుబంధాల తీపి గుర్తులను గ్రామానికి పంచి పోతుంటారు.

ఈ సారి ఏం చేశారంటే..?

అయితే ఈ సారి వారు కాస్తా వైవిద్యంగా ఆలోచించి వినూత్న కార్యక్రమం ఎంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బంధాలు, అనుబంధాల నడుమ జీవనం ఎలా సాగేది, యాంత్రిక జీవన విధానంతో ఏం కోల్పోయామన్న విషయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు ‘బలగం’ మూవీలో. తమ ఫ్యామిలికి అచ్చు గుద్దినట్టుగా సరిపోయే సినిమా కరీంనగర్ లో నడుస్తుందని తెలుసుకున్న ‘చీల’ ఫ్మామిలీ మెంబర్స్ 50 మంది కలిసి మూవీ చూశారు. ఉగాది పర్వదినం రోజున కరీంనగర్ శ్రీనివాస థియేటర్లో ‘చీల’ కుటుంబ బలగమంతా కలిసి బలగం సినిమా చూసి ఆనందాన్ని పంచుకుంది. బలగం సినిమా తీసిన వేణు గత వైభవపు మానవత్వాన్ని నేటి సమాజానికి పంచేందుకు వెండి తెరపైకి ఎక్కిస్తే, నేటికీ అలాగే బ్రతుకుతున్నామని చేతల్లో చూపించేందుకు ‘చీల’ బలగం అంతా కలిసి ఈ మూవీని చూసి వేణు అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరించారు.

You cannot copy content of this page