రమేష్ బాబు భారతీయుడు కాదు… ఆది శ్రీనివాస్ సుదీర్ఘ పోరాట ఫలితం…

తెలంగాణ హైకోర్టు తీర్పు…

దిశ దశ, వేములవాడ:

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదంపై హై కోర్టు స్పష్టత ఇచ్చింది. ఆయన జర్మనీ పౌరుడేనని తేల్చడంతో పాటు జరిమానా కూడా విధించింది. హై కోర్టు తీర్పుతో రమేష్ బాబు భారతీయుడు కాదని తేలిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై 2009 నుండి హై కోర్టులో  పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన జర్మనీ పౌరుడేనని వాదిస్తున్న శ్రీనివాస్ ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచారు. కేంద్ర ప్రభుత్వం కూడా రమేష్ బాబు పౌరసత్వంపై క్లారిటీ ఇచ్చింది. చివరకు సోమవారం హై కోర్టు చెన్నమనేని రమేష్ బాబు  భారతీయ పౌరుడు కాదని తీర్పునిచ్చింది.

రమేష్ బాబు నేపథ్యం…

సిరిసిల్ల నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన, సీపీఐ నేత చెన్నమనేని రాజేశ్వర్ రావు తనయుడే రమేష్ బాబు. సుదీర్ఘకాలం సీపీఐలోనే కొనసాగిన రాజేశ్వర్ రావు టీడీపీలో చేరారు. 1956 ఫిబ్రవరి 3న జన్మించిన రమేష్ బాబు అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసి జర్మనీ హంబోల్డ్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్ నుండి పీహెచ్ డీ అందుకున్నారు. అక్కడే ఉద్యోగం కూడా చేసిన ఆయనకు 1993లోనే జర్మనీ పౌరసత్వం వచ్చిందని, భారతీయ పాస్ పోర్టును కూడా తిరిగి అప్పగించారన్న వాదనలు కూడా ఉన్నాయి. 2008లో స్వస్థలానికి వచ్చిన రమేష్ బాబు  2009 ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పై 1821 ఓట్ల మెజార్టీతో గెలిచిన రమేష్ బాబు భారతీయుడు కాదని అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ హై కోర్టును ఆశ్రయించారు. 2010లో టీడీపీ వీడిన రమేష్ బాబు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా వేములవాడ నుండి గెలుపొందిన రమేష్ బాబు పౌరసత్వ వివాదం అంశంపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బాబు అభ్యర్థిత్వానికి బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపలేదు. దీంతో ఇక్కడి నుండి చల్మెడ లక్ష్మీ నరసింహరావు పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గెలిచారు.

నిర్విరామ పోరాటం…

వేములవాడ నుండి వరుసగా ఓడిపోతున్న ఆది శ్రీనివాస్ మాత్రం చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదంపై కోర్టులో కేసు కొనసాగిస్తూనే వచ్చారు. 2010 ఉప ఎన్నికలప్పుడు ఆది శ్రీనివాస్ కమిషన్ ను ఆశ్రయించడంతో వేములవాడ ఉప ఎన్నికలను నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దీనిపై హై కోర్టులో టీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు జరిపించాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆది శ్రీనివాస్ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. 2013లో రమేష్ బాబు ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. 2017 డిసెంబర్ నెలలో రమేష్ బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని రమేష్ బాబు హై కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనకు రెండు దేశాల పౌరసత్వం ఉందని ప్రభుత్వం తరుపున అడ్వకేట్లు కోర్టులో వాదనలు వినిపించారు. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10, సెక్షన్ 7 బి సిటీజన్ ఆఫ్ ఇండియా హోదా కలిగి ఉన్నారని, రెండు చోట్ల వివిధ కేటగిరీల కింద రమేష్ బాబు పౌరసత్వం ఉండడం సరికాదన్నారు.  ద్వంద పౌరసత్వాల్లో ఏదో ఒకటి వదులుకోవాలని సూచించిన కేంద్రం  ఇందుకు సంబంధించిన డాక్యూమెంట్లను హై కోర్టుకు సమర్పించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచి సోమవారం వెలువరించింది. 2009 నుండి ఆది శ్రీనివాస్ రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని, అతని ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు.

రూ. 30 లక్షల ఫైన్…

సుదీర్ఘ కాలంలో విచారించిన హై కోర్టు రమేష్ బాబు భారతీయుడు కాదని తేల్చడంతో పాటు అతనికి జరిమానా కూడా విధించడం గమనార్హం. కోర్టును తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆయన పిటిషన్ ను డిస్మస్ చేసింది. తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఫేక్ డాక్యూమెంట్లు సమర్పించారని వ్యాఖ్యానించిన కోర్టు రమేష్ బాబుకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇందులో రూ. 25 లక్షలు ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని, రూ. 5 లక్షలు హై కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటికి చెల్లించాలని ఆదేశించింది. నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని కూడా స్పష్టం చేసింది.

You cannot copy content of this page