బీజేపీ క్యాడర్ ఆందోళనతో వెనక్కి…
పునరాలోచనలో పడ్డ అధిష్టానం
దిశ దశ, వేములవాడ:
వేములవాడ అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్టానం యూ టర్న్ తీసుకుంది. స్థానిక నాయకత్వం అంతా కూడా మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసనలు తెలపడంతో తుల అభ్యర్థిత్వాన్ని కాదని వికాస్ రావుకే టికెట్ ఇచ్చారు. కొద్ది సేపటి క్రితం బీఫారం తీసుకుని వేములవాడ పార్టీ శ్రేణులు హైదరాబాద్ నుండి తిరుగు ప్రయాణం అయ్యాయి.
అదే కొంప ముంచిందా..?
గతంలో జనశక్తి పార్టీలో పనిచేసిన తుల ఉమ బీజేపీ నేతలను టార్గెట్ చేసిన అంశాన్ని వేములవాడ బీజేపీ శ్రేణులు అధిష్టానం ముందు ఎకరవు పెట్టారు. మేడిపల్లి మండలానికి చెందిన పార్టీ అధ్యక్షుడు గోరె బాబు మియాతో పాటు ఇద్దరు సర్పంచులను జనశక్తి హత్య చేయడంతో పాటు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతాప రామకృష్ణపై కూడా దాడి చేసిన విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి వివరించినట్టుగా సమాచారం. ఈ విషయంపై వేములవాడ బీజేపీ పార్టీ శ్రేణులు రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అంతేకాకుండా నక్సల్స్ ప్రాబల్య కాలం నుండి విద్యాసాగర్ రావు బీజేపీతోనే అనుబంధం పెనవేసుకుని ముందుకు సాగుతున్నారని, ఆయన తనయుడు అయిన వికాస్ రావుకు టికెట్ ఇస్తే తప్పేంటని క్యాడర్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు కొంతకాలంగా వికాస్ రావు కూడా నియోజకవర్గంలో సేవలందిస్తూ ప్రజలతో మమేకం అయ్యారన్న విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు వేములవాడ బీజేపీ నేతలు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పునరాలోచనలో పడిపోయి వికాస్ రావు అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది.
చెక్ కే చెక్ పెట్టినట్టా…
వాస్తవంగా తెలంగాణాలో వారసులకు టికెట్ ఇవ్వకూడదన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన పార్టీ నేతలు ఆ దిశగానే ముందుకు సాగించే విధంగా పావులు కదిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నందున బీజేపీలో వారసులకు అవకాశం ఇవ్వకూడదన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యామని బీజేపీలోని ఓ వర్గం నాయకులు భావించారు. కానీ అనూహ్యంగా వేములవాడ పార్టీ శ్రేణులు పట్టుబట్టి తుల ఉమపై ఫిర్యాదుల పరంపర కొనసాగించడంతో పాటు జనశక్తి విప్లవ పార్టీలో పనిచేసిన ఆమె వల్ల పార్టీ శ్రేణులు ఒకప్పుడు తీవ్రమైన కష్టాలను ఎదురు చూశారన్న విషయాన్ని బలంగా వినిపించాయి. దీంతో సాగర్ జీ తనయుడు వికాస్ రావుకు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం పెద్దలు ఒప్పుకోకతప్పలేదు.