ఆరున్నర దశాబ్దాల చరిత్రకు బ్రేక్..?

చెన్నమనేని కుటుంబం ప్రాతినిథ్యం లేకుండా

దిశ దశ, కరీంనగర్:

నిజాం విముక్తి పోరాటం నుండి నేటి వరకు ఆ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక భూమిక పోషించిన కుటుంబాల్లో ఈ ఫ్యామిలీ ఒకటిగా చెప్పవచ్చు. నిజాం పరిపాలన నుండి స్వేఛ్చా స్వాంతంత్రం పొందిన తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ కుటుంబం తన ప్రత్యేకతను చాటుకుంది. ఆరున్నర దశాబ్దాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజకీయాలతో అనుబంధం పెనవేసుకుని ముందుకు సాగిన ‘చెన్నమనేని’ ఫ్యామిలీ మెంబర్స్ తొలిసారి ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

1957 నుండి…

పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (పీడీఎఫ్) అభ్యర్థిగా చెన్నమనేని వారసులకు పెద్దన్న అయిన రాజేశ్వర్ రావు చొప్పదండి నుండి 1957లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల నుండి కూడా పోటీ చేసిన ఆయన ఆరు సార్లు గెలిచారు. 2004 తరువాత రాజకీయాల నుండి రాజేశ్వర్ రావు తప్పుకోవడంతో 2009 నుండి ఆయన తనయుడు చెన్నమనేని రమేష్ బాబు 2018 ఎన్నికల వరకు వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో రమేష్ బాబుకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా ఆ స్థానంలో చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇక్కడి నుండి చెన్నమనేని రాజేశ్వర్ రావు కుటుంబం ప్రత్యక్ష్య రాజకీయాల్లో లేకుండా పోయినట్టు అయింది. చెన్నమనేని కుటుంబానికి చెందని చిన్న వాడు చెన్నమనేని విద్యాసాగర్ రావు తొలుత జనసంఘ్ లో పనిచేసి ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. బీజేపీ ఆవిర్భావం తరువాత కూడా అదే పార్టీలో కొనసాగిన సాగర్ జీ 1985 నుండి 1998 వరకు మెట్ పల్లి ఎమ్మెల్యేగా గెలిచి, 1998. 1999 లోక సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఆ తరువాత కూడా కరీంనగర్ నుండి ఎంపీగా, వేములవాడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ తెలంగాణ ఉద్యమ ప్రభావంతో చట్ట సభలకు ఎన్నిక కాలేకపోయారు. మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించిన విద్యాసాగర్ రావు ఇటీవలే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో వేములవాడ నుండి తన తనయుడు వికాస్ రావుకు టికెట్ ఇప్పించుకోవాలని చివరి వరకూ ప్రయత్నించినప్పటికీ అధిష్టానం మాత్రం బీసీ మహిళ తుల ఉమ వైపే మొగ్గు చూపింది. వీరి మరో సోదరుడు వెంకటేశ్వర్ రావు 1983లో సిరిసిల్ల సమితి అధ్యక్షులుగా పోటీ చేసి ఓటమి పాలు కాగా మూడు సార్లు సిరిసిల్ల సెస్ డైరక్టర్ గా గెలిచారు. ఆయన తనయుడు శ్రీకుమార్ 2006లో కొనరావుపేట జడ్పీటీసీగా గెలిచారు. చట్ట సభలకు జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం చెన్నమనేని కుటుంబ సభ్యులు తెలంగాణ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న చరిత్ర అందిపుచ్చుకున్నారు. కానీ తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం చెన్నమనేని కుటుంబానికి ఏ పార్టీ కూడా అవకాశం కల్పిచకపోవడం గమనార్హం. దీంతో దాదాపు ఆరున్నర దశాబ్దాల కాలం పాటు చట్ట సభల ఎన్నికల్లో ప్రాతినిథ్యం కనబర్చిన ఆ కటుంబం నేడు అనుకోని పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సి వచ్చింది.

You cannot copy content of this page