చెన్నూరులో కీలక పరిణామాలు…
దిశ దశ, మంచిర్యాల:
చెన్నూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతకు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆ నాయకుడిని బరిలో నిలిపిందుకు కమలం పార్టీ నేతలు పావులు కదుతుపుతున్నట్టుగా తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు కాషాయం కండువా కప్పేందుకు బీజేపీ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం. ఆయన భార్య భాగ్యలక్ష్మీ మంచిర్యాల జడ్పీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన్ని తిరిగి సొంత గూటికి రప్పించుకోవడంలో సఫలం అయిన చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్… మరో పార్టీ వైపు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నల్లాల మాత్రం బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. శనివారం రాత్రి నుండి అనూహ్యంగా బీజేపీ నాయకులు నల్లాల ఓదెలుతో మంతనాలు జరిపి ఆయన్ని హైదరాబాద్ కు తీసుకెళ్లారని తెలిసింది. ఈ రోజు రాత్రి వరకు బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపిన అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
అలెర్ట్ అయిన ఓదెలు…
అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలును తిరిగి సొంత పార్టీలోకి చేర్పించుకునే విషయంలో బీఆర్ఎస్ నాయకులు చూపిన శ్రద్దలో కొంతమేర కూడా ఆ తరువాత ఆయనపై కనబర్చలేదన్న వాదన వినిపిస్తోంది. ఓదెలు అనుచరులు కూడా ఇదే అంశాన్ని వివరిస్తూ… తమ నాయకునికి అన్యాయం చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతరాత్రా అండదండలు కూడా అందిస్తామని హామీ ఇచ్చి ఆ తరువాత ఆయన్ని పట్టించుకునే వారే లేకుండా పోయారన్న వాదనలు వినిపిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితే భవిష్యత్తులో ఎలాంటి గుర్తింపు లభించదని… ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవల్సిందేనని ఓదెలు అనుచరులు ఒత్తిడికి గురి చేస్తున్నట్టు సమాచారం. అయితే ఓదెలుకు బీఎస్పీ నుండి కూడా ఆఫర్ వచ్చినప్పటికీ చెన్నూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి వెల్తేనే అన్నింటా మంచిందన్న సూచన చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయన శుక్రవారం రాత్రి నుండి స్థానిక బీజేపీ నాయకులతో మంతనాలు జరిపి శనివారం హుటాహుటిన హైదరాబాద్ కు తరలివెల్లినట్టుగా తెలుస్తోంది. కొన్ని గంటల్లో ఓదెలు పార్టీ మారే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వి‘వేకానందమా’..?
అయితే ఓదెలు పేరును తెరపైకి తీసుకరావడంలో మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జి వివేకానంద కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలో నల్లాల ఓదెలుపై సానుభూతి ఉండడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆయనకు అనుకూలమైన వాతావరణం నెలకొందన్న విషయాన్ని వివేక్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. గత లోకసభ ఎన్నికల్లో తనపై పైచేయి సాధించిన వారిలో ఒకరైన బాల్క సుమన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న ఎత్తుల్లో భాగంగాగనే నల్లాల ఓదెలుకు బీజేపీ కండువా కప్పించే విషయంలో పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది.