కామ్రేడ్స్ డిమాండ్ తో కథ మొదటికి…

చెన్నూరు స్థానం వారికేనా..?

బాల్క’ అల్కగా గెలుస్తాడా..?

దిశ దశ, చెన్నూరు:

పొత్తుల ఎత్తులతో కాంగ్రెస్ పార్టీ స్ధానాల కెటాయింపు అంశంలో రోజుకో పేరు వెలుగులోకి వస్తోంది. నిన్న మొన్నటి వరకు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఆ జాబితాలో ఉందన్న ప్రచారం సాగగ తాజాగా చెన్పూరు పేరు తెరపైకి వస్తోంది. గతంలో కామ్రేడ్స్ ప్రాతినిథ్యం వహించిన బెల్లంపల్లి స్థానం నుండి అభ్యర్థిని ప్రకటించడంతో ఇక చెన్నూరు సెంటర్ ను కామ్రేడ్స్ కు అప్పగిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నల్లాల భవితవ్యం..?

చెన్నూరు నియోజకవర్గాన్ని కమ్యూనిస్టులకు కెటాయించినట్టయితే బీజేపీ నుండి ఆఫర్ వచ్చినా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భవితవ్యం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందన్న ఆశతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు ఊరు వాడ కలియ తిరుగుతున్నారు. నల్లాల దంపతులు ఇద్దరు నియోజకవర్గంలో తిరుగుతూ పట్టుబిగించే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో ఓదెలుకు సానుకూల వాతావరణం ఏర్పడుతున్న క్రమంలో ఇప్పుడు ఇక్కడి నుండి కామ్రేడ్స్ కు సీటు కెటాయిస్తారంటూ ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీంతో చెన్నూరు నియోజకవర్గంలో నిన్నటి వరకు ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పార్టీ మారినా నల్లాలకు అన్యాయం జరుగుతోందంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇదే సమయంలో కమ్యూనిస్టుల ఉనికి అంతగా లేని చెన్నూరు నియోజకవర్గాన్ని పొత్తులో వారికి అప్పగించడం కూడా సరైన నిర్ణయం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమయితే కాంగ్రెస్ క్యాడర్ కూడా ఢీలా పడిపోయే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 మంది ఆశావాహులు చెన్నూరు స్థానం నుండి పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు పొత్తుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకరావడంతో వారంతా కినుక వహిస్తున్నారు.

బాల్క అల్కగా గెలుస్తాడా..?

కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల పొత్తుల సమీకరణాల్లో చెన్నూరు స్థానం నుండి కామ్రేడ్స్ పోటీ చేస్తే మాత్రం ఫలితాలు కూడా అంచనాలకు మించి మారిపోతాయన్న చర్చ కూడా సాగుతోంది. కామ్రేడ్స్ కు ఇక్కడి నుండి అవకాశం ఇచ్చినట్టయితే బాల్క సుమన్ సునాయసమైన విజయాన్ని అందుకుంటారని రాజకీయ విశ్లేషకులు ఘంటా పథంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితేనే గట్టి పోటీ ఉంటుంది కానీ కమ్యూనిస్టుల పరం అయితే మాత్రం ఆ పార్టీ చేజేతులా ఓ సీటు కోల్పోయినట్టేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మైండ్ గేమ్…?

అయితే చెన్నూరు స్థానం కమ్యూనిస్టు పార్టీలకు కెటాయించే అంశం చర్చకు వచ్చిందన విషయం మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కానీ ఊహాగానాలు మాత్రం ఊపందుకున్నాయి. దీంతో ఇదే నిజమన్న భావనతో చర్చోపచర్చలు సాగుతున్నప్పటికీ ఇదంతా మైండ్ గేమ్ లో భాగంగానే ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు.

You cannot copy content of this page