సీఎం కేసీఆర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అఫిడవిట్లలో వింత
దిశ దశ, హైదరాబాద్:
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్ తో సహా ఇచ్చే ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్లలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటుటాయి. నిరంతరం ప్రజా క్షేత్రంలో బరిగీసి కొట్లాడే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ కు ఇచ్చే అపిడవిట్లను నిశితంగా పరిశీలిస్తే గమ్మత్తైన విషయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన అఫిడవిట్ ను, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి వివేకానంద అఫిడవిట్ ను గమనించినప్పుడు అత్యంత విచిత్రమైన అంశం వెలుగులోకి వచ్చింది. గజ్వేల్, కామారెడ్డిల నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ ఇచ్చిన అఫిడవిట్ లో సీఎం కేసీఆర్ తనకు రూ. కోటి బాకీ ఉన్నారని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తాను గడ్డం వివేక్ కు రూ. కోటి 6 లక్షలు అప్పు ఉన్నానంటూ వివరించారు. అభిప్రాయబేధాలే కాకుండా అప్పుగా ఇచ్చే నగదు విషయంలోనూ వీరిద్దరి మధ్య బేధాలే ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు పలువురు.
ముఖ్యమంత్రికే అప్పు…
ఓ సారి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన సాధారణ వ్యక్తి, సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమత్రి కేసీఆర్ కే అప్పు ఇచ్చే స్థాయిలో ఉండడం విశేషమనే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికే అప్పు ఇచ్చిన క్రెడిట్ మన అభ్యర్థికే దక్కిందని చెన్నూరు ఓటర్లు అనుకుంటున్నారు. మరో వైపున సీఎం కుటుంబానికి సన్నిహితుడైన బాల్క సుమన్, కేసీఆర్ కు రుణం ఇచ్చిన వివేకానంద ఇద్దరూ తమ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్నారంటు మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన చెన్నూరు ఓటర్లు వీరిద్దరిలో ఎవరిని గెలిపించినా… ముఖ్యమంత్రి కేసీఆర్ తో అనుబంధం ఉన్న వారినే గెలిపించినట్టు అవుతుందన్న కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చెన్నూరు స్పెషాలిటీయే వేరని మరోసారి తేటతెల్లం అయింది.