దిశ దశ, పెద్దపల్లి:
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికో… గంజాయికి అడిక్ట్ అయిన వారికో… రౌడీ షీటర్లు, హిస్టరీ షీట్ ఉన్న వారికో… సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు షేర్ చేసే వారికో కౌన్సెలింగ్ ఇచ్చే పోలీసులు వేలం పాట నిర్వహించారు. లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరికలు ఇచ్చే పోలీసులు సర్కారు వారి పాట అంటూ వేలం పాట చేపట్టారు. ఒకటో సారి రెండో సారి అంటూ యాక్షన్ నిర్వహించారు. కాఖీ యూనిఫారం ధరించే పోలీసులు వేలం నిర్వహించడం ఏంటా అని ఆలోచించకండి… కోర్టు ఆదేశాల మేరకు బహిరంగ వేలం చేపట్టక తప్పలేదు ఆ జిల్లా పోలీసులకు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెంచికల్ పేట గ్రామంలో గత నెలలో కోళ్ల దొంగతనం జరుగుతున్నాయని కేసు నమోదు అయింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను, రెండు కోళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పర్చిన పోలీసులను కోళ్లను వేలం వేయాలని ఆదేశించింది. దీంతో మంగళవారం కమాన్ పూర్ పోలీసులు స్టేషన్ లో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఒక కోడికి రూ 4వేల ధర పలకగా మరో కోడికి రూ. 2,500 ధర పలికింది.
పోలీసుల రక్షణ
గత నెలలో కోళ్ల ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోలసి వచ్చింది. కోర్టు పరిధిలో ఉన్నందున కోళ్లకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రెండు కోళ్ల కోసం ప్రత్యేకంగా ఐరన్ గ్రిల్స్ బోనును తయారు చేయించి కాపాడారు. పౌష్టికాహారం అందిస్తూ కంటికి రెప్పలా కాపాడారు. చివరకు వాటిని వేలం వేయాలని కోర్ట్ ఆదేశించడంతో యాక్షన్ నిర్వహించారు.