ఎమ్మెల్యే స్టైల్ అంటే ఇది…

దిశ దశ, చొప్పదండి:

స్వరాష్ట్ర కల సాకరం కోసం పోరుబాట పట్టి… విద్యార్థి నాయకుడిగా క్షేత్ర స్థాయి సమస్యలేంటో గమనించిన ఆయన చట్ట సభకు ఎన్నిక కాగానే వైవిద్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఓ పనికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందంటే చాలు ఆర్భాటం ప్రదర్శిస్తూ… తమలోని ఔదార్యం ఇదేనంటూ ప్రగల్భాలకు పోతున్న తీరుకు వ్యతిరేక దిశలో ముందుకు సాగుతున్నారు. నామ మాత్రపు నిధులు మంజూరు చేయించి అంత ఎత్తున శిలా ఫలకాలు ఏర్పాటు చేయాలని హుకూం జారీ చేసే విధానానికి ఆయన స్వస్తి పలికారు. ఉస్మానియా జేఏసీ ద్వారా ఉద్యమం చేసిన ఆ నేత ప్రజా క్షేత్రంలోనూ తన మార్కు పరిపాలన కొనసాగిస్తున్నారు.

చొప్పదండి ఎమ్మెల్యే…

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న చిన్న పనులకు మంజూరు అయ్యే నిధులే అంతంత మాత్రమే అంటే శిలాఫలకాల పేరిట అదనపు భారం వేయడం సరికాదని నిర్ణయించుకున్నారు. ప్రచారం లేకుండానే సాదాసీదాగా తన నిర్ణయాన్ని అమలు చేస్తున్న మేడిపల్లి సత్యం తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. తన నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ది పనుల ప్రారంభం కోసం శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపనలు చేయడం వంటి కార్యక్రమాలకు పుల్ స్టాప్ పెట్టేయాలని అధికారులకు చెప్పారు. రూ. 10 లక్షల లోపు పనులకు ఈ తంతు నిర్వహించాల్సిన అవసరం లేదని తేటతెల్లం చేశారు. నిధులు మంజూరయ్యాయంటే చాలు అందుకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసి చకాచకా పనులు పూర్తి చేయాలని, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. దీంతో చొప్పదండి నియోజకవర్గంలో వీఐపీ రాకకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసే అవసరం లేకుండా చేసేశారు. ఇప్పటి వరకు సుమారు 10 నుండి 15 పనులకు శిలాఫలకాలు లేకుండానే పనులు ప్రారంభించేశారు అధికారులు.
పేదల కోసం: మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే

శిలా ఫలకాల కోసం ఖర్చు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని, శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన వారంతా కూడా టెంకాయలు కొట్టడంతో పాటు ఇతరాత్ర ఏర్పాట్లు చేయడం వల్ల కూడా ఆర్థిక భారం పడుతుంది. పనులు చేశామని ప్రజలకు వివరించేందుకు మాత్రమే ఉపయోగ పడే ఈ శిలాఫలకాలను తక్కువ నిధులు వెచ్చించిన చోట ఏర్పాటు చేయడం వల్ల ఆ ఖర్చు భారం ఆ పని నిర్మాణంపై పడుతోంది. అయితే పేద విద్యార్థులు, వికలాంగులను ఆదుకునేందుకు ఈ డబ్బును వెచ్చించినట్టయితే వారికి భరోసానిచ్చే అవకాశం ఉంటుందని కూడా భావించాను. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే శిలాఫలకాలు వేస్తూ ఆర్భాటాలు చేయడం కంటే నియోజకవర్గ ప్రజల సౌకర్యాలను మెరుగుపర్చడం అత్యున్నతమైనదని అనుకున్నాను. కాబట్టి తక్కువ నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపనల కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాను.

You cannot copy content of this page