దశాబ్ది ఉత్సవాలపై కాంగ్రెస్ నిరసనల హోరు…

దిశ దశ, న్యూస్ బ్యూరో:

దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ పది తలల దిష్టి బొమ్మలు దగ్దం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించిన ఈ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం బెట్టు వీడకుండా నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా పది హామీలను నెరవేర్చని సర్కార్ అంటూ పది తలలు ఉన్న దిష్టి బొమ్మను దగ్దం చేయడం గమనార్హం. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నగర కాంగ్రెస్ ఆధర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట చేసుకుంది. పోలీసులు దిష్టిబొమ్మ దగ్దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చింపేశారు.

హుజురాబాద్ లో ఉద్రిక్తం

మరోవైపున హుజురాబాద్ లో కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం అమరవీరుల స్ధూపం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తమ నిరసన తెలిపేందుకు అంబేడ్కర్ చౌక్ వైపు వస్తుండగా పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి నిలువరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమకు 10.30 గంటలకు సమయం ఇఛ్చారని అనుమతి ఇచ్చిన వేళకు నిరసన తెలిపేందుకు వెల్తుంటే ఎలా అడ్డుకుంటారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. అంబేడ్కర్ చౌక్ లో అధికారిక కార్యక్రమం కొనసాగుతున్నందున కొద్దిసేపు వెయిట్ చేయాలని పోలీసులు సూచించినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు ససేమిరా అన్నాయి. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా చివరకు అమరవీరుల స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీ తమ నిరసనను ప్రదర్శించింది.

పడిపోయిన ఏసీపీ…

అయితే కాంగ్రెస్, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో హుజురాబాద్ ఏసీపీ కిందపడిపోయారు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఏసీపీ వెంకటరెడ్డిని పైకి లేపారు. అయితే గొడవ మరింత తీవ్రంగా సాగినట్టయితే తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా చోటు చేసుకునేది. కానీ అంతలోనే పోలీసుల చొరవతో కాంగ్రెస్ శ్రేణులు శాంతించడంతో అంతటితో సమిసిపోయింది.

You cannot copy content of this page