మాజీ ఎమ్మెల్యే పుత్రుడిపై మమకారం… సీఐపై చర్యలకు శ్రీకారం…

దిశ దశ, హైదరాబాద్:

ప్రజా భవన్ వద్ద జరిగిన ప్రమాదంలో నిందితులను మార్చేశారు. మూడో నేత్రం రికార్డు చేస్తున్న విషయాన్ని విస్మరించారు. కఠినంగా వ్యవహరించే కొత్వాల్ డ్యూటీలో జాయిన్ అయ్యారన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. తామేం చేసినా చెల్లుతుందన్న ధీమాతో వ్యవహరించిన పోలీసు అధికారిపై వేటు పడక తప్పలేదు.

పుత్రుడిపై మాజీ ఎమ్మెల్యే మమకారం…

బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు సోహెల్ ఈ నెల 24న బీఎండబ్లూ కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ప్రజాభవన్ సమీపంలో ఉన్న భారికేట్లపైకి తీసుకెళ్లాడు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన గురించి ఎవరు గుర్తిస్తారనుకున్న పోలీసు అధికారులు మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టుగా నడుచుకున్నారు. సోహెల్ కారు నడపడం లేదని డ్రైవర్ నడుపుతున్నాడని ఎఫ్ఐఆర్ జారీ చేశారు. అయితే ఇదంతా కూడా మాజీ ఎమ్మెల్యే షకీల్ వెనకుండి నడిపించాడన్న ప్రచారం కూడా జరిగింది. తన కొడుకు పేరు తెరపైకి రాకుండా ఉండేందుకు ఆయన పావులు కదిపారన్న చర్చలు సాగాయి. అయితే అంతా సవ్యంగా సాగిందనుకున్న క్రమంలో ఈ అంశం ఉన్నతాధికారుల వరకూ చేరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ర్యాష్ డ్రైవింగ్ కేసు పెడితే…

అయితే ప్రజా భవన్ వద్ద బారిగేట్లను తన బీఎండబ్లూ కారుతో ఢీ కొట్టిన మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సొహెల్ పై పంజాగుట్ట పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదు. కానీ సీసీ కెమెరాల ఫుటేజీ ఎవరు చూస్తారులే అన్న ధీమాతో సీఐ దుర్గారావు కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పేరు మార్చేశారు. దీంతో ఈ విషయంపై ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో ఆరా తీయడంతో పాటు సీసీ ఫుటేజీని కూడా సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి పేరు మార్చాల్సి వచ్చింది పంజాగుట్ట పోలీసులకు. ర్యాష్ డ్రైవింగ్ కేసు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సొహెల్ పై నమోదు చేసినట్టయితే అతనికి 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చి కోర్టుకు నివేదిస్తే జరిమానా పడే అవకాశాలు కానీ సాధారణ జైలు శిక్ష విధించే అవకాశం ఉండేది. కానీ ఏ1 నిందితుడినే తారుమారు చేయడంతో ఏకంగా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పైనే వేటు పడింది. పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేస్తూ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటికే సీఐ దుర్గారావు అనారోగ్య కారణం చూపుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయినప్పటికీ అతనిపై వేటు వేయడం మాత్రం ఆగలేదు.

You cannot copy content of this page