నిను వీడని నీడను నేనే… చెన్నమనేనిపై ఫిర్యాదు చేసిన ‘‘ఆది’’

కేసు నమోదు చేసిన సీఐడీ…

దిశ దశ, వేములవాడ:

పట్టు వదలని విక్రమార్కుడిని మరిపించినిట్టుగా న్యాయ పోరాటం చేశారా నాయకుడు. న్యాయస్థానం తీర్పు తరువాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలని CID అధికారులకు ఫిర్యాదు చేశారు. పౌరసత్వ వివాదంలో కోర్టు ఇచ్చిన తీర్పును అందిపుచ్చుకుని క్రిమినల్ కేసు పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 2009 నుండి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో పాటు  న్యాయస్థానాలను ఆశ్రయించి తన ప్రత్యర్థి రమేష్ బాబును దోషి అని తేల్చేవరకు పోరాటం చేశారు. ఇంతటితో ఆగకుండా నిన్ను వదల బొమ్మాళి అన్నట్టుగా తెలంగాణ CID అధికారులకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదులో ఏఏ అంశాలను పొందు పర్చారు..? పిటిషన్ లో పేర్కొన్న అంశాలు ఏంటీ..? చెన్నమనేని రమేష్
బాబుపై ఏఏ సెక్షన్లలో క్రిమినల్ కేసు నమోదయిందంటే..?

స్పిన్నింగ్ మిల్లు కోసం…

2009 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుండి పోటీ చేసిన చెన్నమనేని రమేష్, ఆది శ్రీనివాస్ లు ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కేవలం 1800 ఓట్ల మెజార్టీతో ఓటమి చవి చూసిన ఆది శ్రీనివాస్ ప్రత్యర్థి చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. అయితే స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేసేందుకు ఐదేళ్ల
పాటు ఇక్కడే నివాసం ఉండేందుకు అనుమతించాలని కోరుతూ అప్పటి కరీంనగర్ జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు చెన్నమనేని రమేష్. 2008.03.26న ఆయన చేసిన ఈ దరఖాస్తును పరిశీలించి C.NO: 7/SB/F7/2008 ద్వారా అదే నెల 29న వేములవాడలో నివాసం ఉండేందుకు అనుమతి ఇస్తూ జిల్లా పోలీసు కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రమేష్ బాబు 2008 మార్చి 31న ఫారం-III (రూల్ 5-బి)లో పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 5(1)(f) కింద భారత పౌరుడిగా గుర్తించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులో తాను 12 నెలలుగా భారతదేశంలోనే నివసిస్తున్నానని పేర్కొన్నప్పటికీ ధృవీకరణ పత్రంలో మాత్రం 2007 ఫిబ్రవరి 28న భారతదేశానికి వచ్చానని వివరించారు. మార్చి 1 2007న విదేశాలకు వెళ్లిన ఆయన తిరిగి అదే సంవత్సరం నవంబర్ 26న ఇండియాకు వచ్చారు. ఆ తరువాత డిసెంబర్ 20న విదేశాలకు వెళ్లిన రమేష్ బాబు 2008 ఫిబ్రవరి 28న తిరిగి వచ్చారు.
కేవలం 96 రోజులు మాత్రమే ఇండియాలో నివాసం ఉన్న రమేష్ బాబు 12 నెలల పాటు ఇక్కడే ఉన్నట్టు డిక్లరేషన్ ఇచ్చారు. భారత పౌరసత్వం ఇవ్వడానికి చట్టం 1955లోని సెక్షన్ 5(1) (f)లో షరతులను పాటించకుండా తాను భారత్ లో ఏడాది పాటు ఉన్నట్టుగా వెల్లడించారు. 2009 మార్చి 3న భారత పౌరసత్వం పొందినట్టుగా పేర్కొన్న రమేష్ బాబు దీని ఆధారంగా అదే సంవత్సరం ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు. అప్పుడే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వేములవాడ నుండి ఎమ్మెల్యేగా గెలుపోందారు. అయితే రమేష్ బాబు పౌరసత్వం విషయంలో కేంద్ర హోంశాఖకు మొదట ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ రమేష్ బాబుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ఆ తరువాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు చెన్నమనేని రమేష్ బాబు. ఆది శ్రీనివాస్ కూడా హై కోర్టులో పిటిషన్ ధాఖలు చేసి చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వానికి సంబంధించిన డాక్యూమెంట్లు,  ఆధారాలను సమర్పించారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మళ్లీ పోటీ చేసి గెలిచిన చెన్నమనేని రమేష్ బాబు ఎన్నిక చెల్లదని, ఆయన
భారత పౌరుడు కాదని, ఆయన పేరు ఓటరు జాబితాలో చేర్చడం చట్ట విరుద్దమని మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆది శ్రీనివాస్. 2013లో EPపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై చెన్నమనేని రమేష్ బాబు SLP దాఖలు చేశారు. అయితే ఈ అప్పీళ్లను పరిష్కరించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర హోంశాఖకు ఆది శ్రీనివాస్ చేసుకున్న
దరఖాస్తు ఆధారంగా చెన్నమనేని రమేష్ బాబుకు షోకాజ్ నోటీసు జారీ చేసిన తరువాత ఆయన పౌరసత్వం విషయంలో మోసం చేశారని విచారణ కమిటీ తేల్చి చెప్పింది. షోకాజ్ నోటీసు అందుకున్న తరువాత చెన్నమనేని రమేష్ కేంద్ర హోంశాఖకు సంజాయిషీ ఇవ్వకపోవడంతో పాటు సమగ్ర వివరాలను పరిశీలించిన అధికారులు ఆయన భారత పౌరసత్వం చెల్లదని స్ఫష్టం చేసింది. తిరిగి 2017లో తన దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు 1955 నాటి నిబంధనల ప్రకారం పౌరసత్వ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చింది కోర్ట్. దీంతో కేంద్ర హోంమంత్రిత్వ విభాగంలోని జాయింట్ సెక్రటరీ ఆగస్టు 2017లో చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రమేష్ బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ 6 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కోర్ట్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన నివేదకలపై పలు మార్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఆది శ్రీనివాస్ తరుపున న్యాయవాదులు పౌరసత్వ చట్టాలను, రమేష్ బాబు విదేశాలకు జరిపిన రాకపోకలు సంబంధించిన వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం కొనసాగించడం ప్రజా
శ్రేయస్సుకు అనుకూలమా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలని ప్రత్యేక అథారిటీని హైకోర్టు ఆదేశించింది. చివరకు 2019లో కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో పిటిషనర్ కీలకమైన ప్రజా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, రమేష్ బాబు భారత పౌరసత్వం తీసుకున్నారని, అతను జర్మని పౌరసత్వాన్ని వదులుకున్నాడని వాదనలు వినిపించారు. అయితే ఇందుకు కౌంటర్ దాఖలు చేసిన ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్ వద్ద ఇప్పటికీ జర్మని పాస్ పోర్టు ఉందన్న విషయాన్ని హై కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తరుచూ జర్మనికి వెళ్లి వస్తున్నారన్న విషయాన్ని కూడా ఆది శ్రీనివాస్ తన పిటిషన్ లో పేర్కొనడంతో కోర్టు మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం  వదులకున్నట్టుగా ఆధారాలతో పాటు అఫిడవిట్ సమర్పించాలని, జర్మని
దేశ అధికారుల నుండి కూడా ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించింది. దీంతో జర్మనిలోని భారత రాయబార కార్యాలయం ద్వారా జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన నివేదికను హై కోర్టుకు సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. 2020 డిసెంబర్ 15న భారత అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఇచ్చిన మెమోలో రమేష్ బాబు డిసెంబర్ 3వ వారంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జర్మనికి వెళ్లారని వెల్లడించారు. దీంతో రమేష్ బాబు ప్రయాణాలకు సంబంధించిన సమగ్ర వివరాలు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని హై కోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. ఈ ఆదేశాలు అందుకున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ 2021 జనవరి 14న దాఖలు చేసిన అఫిడవిట్ లో కాన్సూలర్, పాస్ పోర్ట్ వీసీ (CPV) విభాగం అందించినట్టుగా పలు అంశాలను పేర్కొన్నారు. విదేశీ పౌరులకు మాత్రమే జారీ చేసే OCI కార్డ్, జర్మని పాస్ పోర్టు ఆధారంగా ఆయన జర్మని దేశస్తుడేనని వివరించారు. భారత పౌరసత్వం పొందిన తరువాత కూడా రమేష్ బాబు జర్మని పౌరుడిగానే కొనసాగారని, ఆ దేశ పాస్ పోర్టుపై విదేశాలకు ప్రయాణించిన వివరాలను ఇమ్మిగ్రేషన్ ద్వారా సేకరించినట్టుగా ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ వీసీ, ఫారినర్స్ ట్రాకింగ్ (IVFRT) వింగ్ నుండి సేకరించిన వివరాలను హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో భారత అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ సమగ్రంగా పొందుపర్చారు. దీంతో ఆయన జర్మని పౌరుడేనని స్ఫష్టం అవుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  జర్మని దేశంలో శాశ్వతంగా ఉండేందుకు తీసుకున్న PIO కార్డు కూడా ఆయన ఆదేశ జాతీయుడేనని వెల్లడిస్తోందని, పాసుపోర్టు కూడా ఆ దేశానికి సంబంధించినదే ఉందని పేర్కొన్నారు. అయితే తనకు భారతీయ పాస్ పోర్టు ఉందని, జర్మనిలో నివాసం ఉంటున్న తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వచ్చేందుకు ఆ దేశ పాస్ పోర్టును వినియోగించానని రమేష్
బాబు హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇరు పార్టీల వాదనలు, కోర్టు ముందు ఉంచి రికార్డులను పరిగణనలోకి తీసుకున్న హై కోర్టు రమేష్ బాబు దాఖలు చేసిన రిట్ పిటిషన్ నంబర్ 25850/2019ని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. రమేష్ బాబు మొదటి నుండి కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారని, 163 రిట్ పిటిషన్ తో
పాటు తాజా రిట్ పిటిషన్ లో కూడా తన జర్మని పాస్ పోర్టును అప్పగించినట్టుగా వెల్లడించారని, తన జర్మని పౌరసత్వాన్ని కూడా వదులకున్నాన్నట్టుగా కోర్టుకు వివరించారు. రికార్డులకు ఆయన కోర్టుకు వెల్లడించిన అంశాలకు ఏ మాత్రం పొంతన లేదని, వాస్తవ విరుద్దంగా నడుచుకున్నారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. అంతేకాకుండా 2023లో రమేష్ బాబు పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసుకున్నప్పుడు కూడా తాను జర్మని దేశస్తుడిగానే పేర్కొన్నప్పటికీ జర్మని పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నానని కోర్టుకు తెలపడం
గమనార్హం. తన దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించి మోసం చేసి భారత పౌరసత్వం పొందిన తరువాత కూడా PIO గా జర్మన్ పాస్‌పోర్ట్‌పై ప్రయాణించిడం విశేషం. సమగ్ర వివరాలను పరిశీలించిన హై కోర్టు్ రమేష్ బాబు వేసిన రిట్ పిటిషన్లన్నింటిని కొట్టి వేస్తూ ఆధి శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు, హై కోర్టు లీగల్ సర్విసెస్ అథారిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు రమేష్ బాబు దాఖలు చేసిన రిట్ పిటిషన్లు అన్నింటిని కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. 

ఛీటింగ్ చేశారు…

వేములవాడ ఎమ్మెల్యేగా మూడు సార్లు సాధారణ ఎన్నికల్లో, ఒక సారి ఉప ఎన్నిక ద్వారా గెలిచిన చెన్నమనేని రమేష్ బాబు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వేములవాడ నియోజకవర్గ ఓటర్లను కూడా మోసం చేశారని సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 1955 పౌరసత్వ చట్టం, 1967 పాస్ పోర్టు చట్టం, IPC/BNS 2023ల ప్రకారం రమేష్
బాబు నేరాలకు పాల్పడ్డారన్నారు. ఈ మేరకు రమేష్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ అభ్యర్థించారు. దీంతో రమేష్ బాబుపై తెలంగాణ సీఐడీ అధికారులు FIR NO: 01/2025, 465, 468, 471 IPC, చట్టంలోని సెక్షన్ 12 ఆప్ ఇండియన్ పాస్ పోర్టు యాక్టు 1967, సెక్షన్ 14 ఆఫ్ ఫారినర్స్ యాక్ట్, 1946, సెక్షన్ 17 ఆఫ్ ఇండియన్ సిటిజన్ షిప్ యాక్ట్ 1955లలో కేసు నమోదు చేశారు. సీఐడీ అదికారులు ఇచ్చిన నోటీసులను అందుకున్న ఆది శ్రీనివాస్ బుధవారం తనవద్ద ఉన్న సాక్ష్యాదారాలను, కేంద్ర హోంశాఖ అధికారులు హైకోర్టుకు అందించిన నివేదికలు, హై కోర్టు తీర్పు కాపీలను సీఐడీ అధికారులకు అందించారు.

You cannot copy content of this page