దిశ దశ, కరీంనగర్:
మూడు దశాబ్దాలుగా పోలీసులకు చిక్కుకుండా తిరుగుతున్న ఓ నిందితున్ని సీఐడీ స్పెషల్ టీమ్ అరెస్ట్ చేసింది. 1995లో నమోదయిన ఓ కేసులో అతని కోసం గాలించిన పోలీసులు పట్టుకునేందుకు కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఎట్టకేలకు సీఐడీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ అరెస్ట్ చేసింది.
కేసు పూర్వాపరాలివే…
1995 జూన్ 1న జగిత్యాల సమీపంలోని పెర్కపల్లిలోని ఓ ఇంట్లో సమావేశం అయిన కొందరు నకిలీ పిస్తోళ్లు, రాడ్లతో పాటు ఇతర మారణ ఆయుధాలతో షెల్టర్ తీసుకున్నారన్న సమాచరం మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేయగా మరికొంతమంది పరార్ అయ్యారు. వీరిలో ఏ25 నిందితుడు, జిల్లాలోని గొల్లపల్లి మండలం లుత్తునూరుకు చెందిన అప్పళ్ల సత్తయ్య అలియాస్ కోమటి సతీష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం జగిత్యాల రూరల్ పోలీసులు వెతికినప్పటికీ ఆచూకి లభ్యం కాలేదు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. అతని కోసం గాలిస్తున్న సీఐడీ ఎన్.బి.డబ్లూ. స్పెషల్ టీమ్ గురువారం మంచిర్యాలలో అరెస్ట్ చేసింది. 1995 నుండి అదృశ్యం అయిన సత్తయ్యను పట్టణంలోని రాజీవ్ నగర్ లో అదుపులోకి తీసుకున్న సీఐడీ టీమ్ కరీంనగర్ జిల్లా కోర్టులో హాజరు పర్చారు. 29 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సత్తయ్యను పట్టుకోవడంలో సీఐడీ ఏఎస్ఐలు యూనస్ ఖాన్, జె రత్నాజీ రావు, పి మదన్ మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు జి శ్రీనివాస్, ఆర్ శ్రీరాములు ప్రత్యేక చొరవ చూపారు. చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితున్ని పట్టుకున్న సీఐడీ బృందాన్ని అడిషనల్ డిజీపీ శిఖా గోయల్ అభినందించి రివార్డు ఇస్తున్నామని ప్రకటించారు.
https://twitter.com/CIDTelangana/status/1750460730829164915?t=Sa1zUUT2OBDwOTNloxXjCw&s=19