దిశ దశ, హైదరాబాద్:
దశాబ్దాల పాటు సివిల్ సర్విసెస్ అధికారులుగా సేవలందించిన వారిలో కొంతమంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఉన్నతాధికారులుగా వెలుగొంది పొలిటికల్ ఎంట్రీ ఇస్తన్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే సరికొత్త ట్రెండ్ సెట్టర్ క్రియేట్ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ కొంతమంది అధికారులు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడం విశేషం. తెలంగాణ ఆవిర్భావం తరువాత రిటైర్ అయిన అధికారులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వంతో అనుభందం పెన వేసుకున్నారు. తాజాగా సీబీఐ జాయింట్ డైరక్టర్ గా పని చేసిన లక్ష్మి నారాయణ కూడా సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణాలో అడిషనల్ డీజీపీ స్థాయిలో పని చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం బీఎస్పీలో చేరి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ గా ఉన్న ఆయన తెలంగాణాలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఇదే ఎన్నికల్లో స్టేట్ క్యాడర్ నుండి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన నాగరాజు వర్దన్నపేట ఎమ్మెల్యేగా గెలుపోందారు. కేసీఆర్ హయాంలో సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా రమణా చారి, అనురాగ్ శర్మ, రాజీవ్ శర్మ, ఏకే ఖాన్, సోమేష్ కుమార్, శోభతో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారులు రిటైర్ అయిన తరువాత కూడా నామినేటెడ్ పదవుల్లో కొనసాగారు. తెలంగాణాలో ఐఏస్ అధికారిగా పలు జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన ఆకునూరి మురళి కూడా కొంతకాలం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. అనంతరం ఆ బాధ్యతలకు కూడా రాజీనామా చేసిన ఆయన బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలతో పాటు విద్యారంగ సంస్కరణలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆకునూరి మురళీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతకుముందు డీజీపీగా పని చేసిన దిలీప్ రెడ్డి కూడా వైసీపీ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓడి పోయారు. అయితే ఈ సారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మరింత మంది ఉన్నతాధికారులు గులాభి పార్టీతో ఉన్న అనుభందంతో రాజకీయాల్లోకి చేరే వారన్న ప్రచారం కూడా ఉంది. ఇకపోతే ఏపీలో లోక్ సత్తా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన జయప్రకాష్ నారాయణ కూడా ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం. కొంత కాలం తరువాత జయ ప్రకాష్ నారాయణ లోకసత్తా పేరటి రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణాకు చెందిన స్టేట్ క్యాడర్ నుండి ఐపీఎస్ అధికారిగా ఉన్న మరో సీనియర్ పోలీస్ ఆపీసర్ కూడా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ అక్కడి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీ నారాయణ కూడా సొంత పార్టీ ఏర్పాటు చేయడం గమనార్హం. గతంలో జనసేన పార్టీలో కొనసాగిన జేడీ లక్ష్మీ నారాయణ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జనసేనకు రాజీనామా చేసిన జేడీ గతంలోనే జై భారత్ (ఎన్) పేరిట కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేయించినప్పటికీ శుక్రవారం రాత్రి అధికారికంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జై భారత్ తరుపున అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ పై సీబీఐ జాయిట్ డైరక్టర్ హోదాలో కేసులు విచారణ చేసిన జేడీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ తరువాత కూడా పలు అంశాలపై మీడియాలో చర్చల్లో పాల్గొంటారు. యువత, విద్యార్థులకు ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటు భారత ఇతిహాసాలు, నోట్ల రద్దు వంటి కీలకలమైన అంశాలపై ప్రసంగాలు చేస్తారు. తాజాగా ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎలా ఆయన్ని అక్కున చేర్చుకుంటారోనన్నది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తేలనుంది.