ఆ ఇద్దరూ సివిల్ సర్విసెస్ అధికారులుగా తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన వారే. తమకు అప్పగించిన బాధ్యతల్లో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నవారే. ఉమ్మడి రాష్ట్రం నుండి స్వరాష్ట్ర కల సాకారం అయ్యే వరకూ సేవలందించిన వారే. ఇద్దరు కూడా తమ బాధ్యతలకు రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
ఐఏఎస్ కు బై బై చెప్పిన ఆకునూరి
ఐఏఎస్ కు రాజీనామా చేసి దళితులపై జరుగుతున్న వివక్షను బట్టబయలు చేసిన మొట్టమొదటి అధికారి ఆకునూరి మురళీ. పురావస్తు శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాజీనామా చేశారు. అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు వినియోగించుకోవాలని భావించి ఆయనకు పాఠశాల విద్యా మౌళిక సదూపాయాల కల్పన సలహాదారుగా నియమించింది. ఈ బాధ్యతలకు కూడా స్వస్తి చెప్పిన మురళీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న చర్చ అటు అధికార వర్గాల్లో ఇటు విద్యావంతుల్లో వ్యక్తం అయింది. ముక్కుసూటిగా మాట్లాడే ఆకునూరి మురళీ అనగారిన వర్గాల గురించి ఎక్కువ శ్రద్ద చూపుతారని, విద్యారంగంతో పాటు మౌళిక వసతుల అందించే విషయంలో తన ప్రత్యేకతను ప్రదర్శిస్తారని పేరుంది. సాధారణ కుటుంబంలో జన్మించిన మురళీ త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. ఆయన ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతారని భావించినప్పటికీ అనూహ్యంగా పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. దీంతో తెలంగాణాలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుందని తేటతెల్లం అయింది.
బీఎస్పీ… ఆరెఎస్పీ…
ఇక పోతే ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన బాధ్యతలకు రాజీనామా చేశారు. పలు జిల్లాల్లో పోలీసు అదికారిగా సేవలందించిన ఆర్ ఎస్పీ హైదరాబాద్ లో పలు విభాగాల్లో పని చేసి రాజీనామాకు ముందు గురుకులాల కార్యదర్శిగా పని చేశారు. బాధ్యతలు నిర్వర్తించే చోట తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేయడంలో ప్రవీణ్ కుమార్ స్పెషాలిటీ వేరేనని చెప్పాలి. అనూహ్యంగా రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తెలిసినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా బీఏస్పీలో చేరారు. దీదీ మాయావతితో ఉన్న వ్యక్తిగత పరిచయాలు, రాష్ట్రంలోని ప్రవీణ్ కుమార్ ఫాలోవర్స్ అంతా కూడా బీఎస్పీలో చేరాలని సలహా ఇవ్వడం వల్లే ఆయన అటువైపు అడుగులు వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్న ఆర్ఎస్పీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నుండి సీరియస్ పొలిటిషియన్ గా మారిపోయారు.
రెండేళ్ల తేడాలో ఇద్దరు సివిల్స్ అధికారులు…
తెలంగాణాలో రెండేళ్ల తేడాలో ఇద్దరు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులు బాధ్యతల నుండి తప్పుకోవడం సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ 2018 జులైలో తన బాద్యతల నుండి తప్పుకుంటున్నాని వెల్లడించారు. రిటైర్ మెంట్ కు 10 నెలల ముందు రాజీనామా చేసిన ఆకునూరి మురళీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత 2021 జులైలో రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ బాధ్యతల నుండి తప్పుకున్న కొద్ది రోజుల్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. దళిత అధికారులైన వీరద్దరూ కూడా రాజీనామ చేసి అణగారిన వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. అయితే ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులు వేర్వేరు పార్టీల్లో చేరి రాజకీయ సమీకరణాలు నెరుపుతుండడం విశేషం. అంతంత మాత్రంగా ఉన్న పార్టీకి జీవం పోసే పనిలో ఒకరు, కొత్త పార్టీతో మరోకరు ప్రజా క్షేత్రంలో తమ సత్తా చాటుకునే పనిలో నిమగ్నం అయ్యారు.