పెద్దపల్లి జిల్లాలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ దాడులు

ధాన్యం వివరాలు సేకరిస్తున్న ప్రత్యేక బృందాలు

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లాలో సివిల్ సప్లై విజిలెన్స్ విభాగానికి చెందిన బృందాలు మంగళవారం దాడులు చేపట్టాయి. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు సరఫరా అయిన ధాన్యంలో తరుగు పేరిట ఎక్కువగా కోతలు విధిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఈ బృందాలు క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టాయి. జిల్లాలోని కదంబాపూర్ గ్రామంలోని ఓ రైస్ మిల్లు యాజమాన్యం తరుగు పేరిట 40 కిలోలకు మించి కోత విధిస్తున్నారని కొంతమంది రైతులు సివిల్ సప్లై విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఒక్కో బస్తాకు 4 నుండి 5 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు మంగళవారం సివిల్ సప్లై విజిలెన్స్ వింగ్ ఓఎస్డీ ప్రభాకర్ నేతృత్వంలో రెండు బృందాలు విచారణ చేపట్టాయి. సదరు మిల్లులో కూడా ధాన్యం సేకరించిన వివరాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ మిల్లుకు ఐదు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సరఫరా అయ్యాయని ఇందుకు సంబంధించిన ట్రక్ షీట్లను సేకరించి ఆరా తీస్తున్నాయి బృందాలు. ఐదు కొనుగోలు కేంద్రాల నుండి ఎంత మేర ధాన్యం మిల్లుకు చేరుకుంది, అందులో బియ్యం సిద్దం చేసిందెంత..? పర్ఛేజింగ్ సెంటర్లలో ఇచ్చిన ట్రక్ షీట్లకు మిల్లుకు చేరిన తరువాత రైతుకు ఇచ్చిన రశీదులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ధాన్యం మిల్లుకు చేరినప్పుడు రిజిస్టర్ మెయింటెన్ చేయాల్సి ఉంటుందని, ఆ రిజిస్టర్లు కూడా తనిఖీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లులోని రిజస్టర్లు, రైతులకు ఇచ్చిన రశీదులను హెచ్చు తగ్గులపై విచారణ చేపట్టారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణాంకాలలతో పాటు వివిధ కోణాల్లో మిల్లుపై సమగ్ర విచారణ చేపడుతున్నారు. అయితే ఈ విచారణ బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా సివిల్ సప్లై విభాగానికి చెందిన అధికారుల బృందం కూడా విజిలెన్స్ అధికారులతో విచారణలో పాల్గొంది.

You cannot copy content of this page