వర్గపోరా… ఆదిపత్య పోరా…?

హుజురాబాద్ బీఆర్ఎస్ లో యుద్దం

ఫోన్లు స్విచ్చాఫ్ చేయాలంటున్న నేత

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు

దిశ దశ, కరీంనగర్:

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన నియోజకవర్గాల్లో ఒకటైన హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో ఏకంగా కుర్చీలు గాల్లోకి లేచాయి. ఒక్క సారిగా పరిస్థితి చేయి దాటి పోవడంతో నియోజకవర్గ ఇంఛార్జి పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది.

ఏం జరిగిందంటే..?

నియోజకవర్గంలోని కమలాపూర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి ముందే మండల నాయకులు తమ ఆధిపత్య పోరును ప్రదర్శించారు. ఇరు వర్గాల మధ్య మొదట మాటల యుద్దంతో మొదలైన రచ్చ చివరకు కుర్చీలు విసురుకునే వరకూ చేరింది. తగ్గేదేలే అన్న రీతిలో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య నెలకొన్న ఈ యుద్దాన్ని నిలువరించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని గమనించిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అసహనం వ్యక్తం చేసి వెనుదిరిగారు. సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… పార్టీలో ఇబ్బంది ఉన్న వాళ్లు బయటకు వెళ్లిపోవాలని స్పష్టం చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.

పోన్లు స్విఛ్చాఫ్…

మరో వైపున నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసిన పాడి కౌశిక్ రెడ్డి సెకండ్ క్యాడర్ కు హుకూం జారీ చేస్తున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తనవద్దకు వచ్చే వారు ఖచ్చితంగా మొబైల్ స్విచ్ఛాప్ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సమావేశాల్లో అయినా అంతర్గత చర్చల్లో అయినా ఏ స్థాయి నాయకుడు కూడా ఫోన్ ఆన్ లో ఉంచకూడదని సైలెంట్ మోడ్ కాకుండా ఏకంగా స్విచ్ఛాప్ చేయాలని చెప్తుండడం గమనార్హం. దీంతో ఆశించే క్యాడర్ పై శాసించే పరిస్థితి నెలకొనడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

బాద్షా నేనే…

సోమవారం జరిగిన పలు మండలాల బీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. తాను చెప్పినట్టే నడుచుకోవాలని లేనట్టయితే ఊరుకునేది లేదు అన్న రీతిలో ఆదేశాలు జారీ చేస్తున్నారని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాద్షా తానేనని పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా హుజురాబాద్ విషయానికి వస్తే తాను చెప్పిందే వేదమన్న విషయం గుర్తు పెట్టుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నారని పార్టీ వర్గాలు మనో వేదనకు గురువుతున్నాయి. దీంతో హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో అయోమయం నెలకొంది. ఇటీవల కాలంలో అంతర్గతంగా జరిగిన సమావేశాల్లో కౌశిక్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో మొబైల్స్ ఆఫ్ చేయాలని చెప్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ లో ఈటలను ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్వవహార శైలి ఇబ్బందులు తెచ్చిపెట్టనుందన్న అభిప్రాయాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page