దిశ దశ, కరీంనగర్:
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై జరిగిన సమీక్షా సమావేశం రసాభసాగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రసంగిస్తుండగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోక్యం చేసుకుని నీదేం పార్టీ అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని సంజయ్ బదులివ్వడంతో కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో పాడి కౌశిక్ రెడ్డికి, డాక్టర్ సంజయ్ లు ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన సహచర ఎమ్మెల్యేలు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశంలో సంజయ్ ని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి మాటలు తూలారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా జోక్యం చేసుకుని కౌశిక్ రెడ్డిని వారించే ప్రయత్నం చేసి ఆయనను బయటకు తీసుకొచ్చారు.
పాడి కౌశిక్ రెడ్డి ఫైర్…
రివ్యూ సమావేశం నుండి బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా రూ. 15 వేలకు బదులు 12 వేలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారులకు, పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే మీకు జీతాలు పెంచింది, వాహనాలు సమకూర్చింది, స్టేషన్లను 5 స్టార్ లా తీర్చిదిద్దింది కేసీఆర్ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. మరో మూఢేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు ప్రతీకారం తీసుకోవల్సి వస్తుందని కూడా హెచ్చరించారు.
అన్న ముందే…
తన అన్న, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే పాడి కౌశిక్ రెడ్డి దూకుడు ప్రదర్శించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా జరుగుతున్న సమీక్షా సమావేశంలో పార్టీల విషయాలను ప్రస్తావనకు తీసుకరావడం ఏంటని కూడా సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. అయితే కౌశిక్ రెడ్డికి, డాక్టర్ సంజయ్ కి మధ్య సమీక్షా సమావేశంలో జరిగిన వాగ్వాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంపై అధికార పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు.