11 మంది మావోయిస్టుల మృతి..?
దిశ దశ, దండకారణ్యం:
మరోసారి దండకారణ్య అటవీ ప్రాంతం కాల్పుల మోతలతో దద్దరిల్లిపోయినట్టుగా సమాచారం వస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహధ్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎధురు కాల్పుల్లో మావోయిస్టులు మరోసారి భారీ నష్టాన్ని చవి చూసినట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలోని ఘమండి, కుర్రేవాయి గ్రామాల మధ్య బలగాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం. గత రెండు రోజులుగా నాలుగు జిల్లాలకు చెందిన 1400 మంది బలగాలు అభూజామఢ్ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. రెండు రోజుల క్రితం సెర్చింగ్ ఆఫరేషన్ ప్రారంభించిన బలగాలకు ఘమండి, కుర్రేవాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు ప్రారభం అయినట్టు సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి 11 మంది మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో మరణించినట్టుగా బస్తర్ రేంజ్ పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టుగా సమాచారం.