భట్టి ముందే ఆదిపత్య పోరు…
వర్గపోరు తలనొప్పి తప్పదా…
దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. గురు శిష్యుల మధ్యే వార్ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎల్పీ నేత భట్టి ముందే ఆదిపత్య పోరు ప్రదర్శించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చింతకుంట… గంట
పెద్దపల్లి కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఓదెల జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు యాదవ్ మధ్య నిన్న మొన్నటి వరకు ఉన్న కోల్డ్ వార్ కాస్తా ఓపెన్ అయిపోయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటనలో ఇరు వర్గాల మధ్య ఆదిపత్య పోరు ప్రారంభం కావడం సంచలనంగా మారింది. ఒకప్పుడు గురు శిష్యులుగా పేరొందిన వీరి మధ్య అభిప్రాయబేధాలు పొడసూపడంతో భట్టి పాదాయత్రలో ప్రచ్ఛన్న యుద్దం జరుగుతోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇద్దరూ ఒక్కటిగా నడుస్తూ ముందుకు సాగినప్పటికీ ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. టీడీపీలో కలిసి నడిచిన విజయ రమణారావు, గంట రాములులు కాంగ్రెస్ లో కూడా ఒక్కటిగానే చేరారు. కానీ కొంత కాలంగా వీరిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ బేధాలు రచ్చకెక్కడంతో పాటు పెద్దపల్లి టికెట్ తాను కూడా ఆశిస్తున్నానన్న సంకేతాలు గంట రాములు యాదవ్ ఇటీవల కాలంలో ఇస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న రాములు ఒక దశలో విజయరమణారావుకు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ఒకప్పుడు ఇద్దరు కలిసి అందిరి దృష్టిని ఆకర్షిస్తే… ఇప్పుడు మాత్రం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంత దూరం అయ్యారు.
పాలితం నుండి స్టార్ట్…
పెద్దపల్లి జిల్లాలోకి భట్టీ పాదయాత్ర ఎంటర్ కాగా మంగళవారం పాలితం నుండి పెద్దపల్లి వరకు ఇరు వర్గాలు ప్రచ్ఛన్న యుద్దాన్ని తలపిస్తున్న విధంగా వ్యవహరిస్తున్నాయి. పాలితంలో భట్టీతో కలిసి నడిచేందుకు అటు విజయరమణ రావు వర్గం ఇటు రాములు యాదవ్ వర్గం పోటా పోటి నినాదాలు ఇచ్చుకున్నారు. ఉదయమే తమ వైఖరి ఏంటో చెప్పకనే చెప్పిన ఈ రెండు వర్గాల విషయంలో ఓ కన్నేసి ఉంచడపోవడంతో సాయంత్రానికల్లా పంచాయితీ కాస్తా దాడుల వరకూ చేరింది. భొంపల్లి వద్దకు భట్టీ యాత్రలో భాగంగా చింతకుంట, గంటలకు చెందిన వర్గాలు కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇరు వర్గాల్లోని కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య వార్ ఇలాగే కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాత్రి జెండా చౌరాస్తాతో పాటు బుధవారం ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో జరగనున్న యాత్రలో కూడా వీరిద్దరి యుద్దం మరింత ముదిరి పాకాన పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుగా చింతకుంట విజయరమణారావు, గంట రాములు యాదవ్ ల మధ్య సయోధ్య కుదిర్చిన తరువాతే యాత్ర కొనసాగిస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేనట్టయితే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు.