ఫిర్యాదులపై అధిష్టానం సీరియస్
నేడో రేపో అధికారిక ఉత్తర్వులు
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో నెలకొన్న విబేధాలపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్గతంగా వ్యవహరించాల్సిన విషయాలను రచ్చకెక్కడంపై జాతీయ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో నామమాత్రపు ఉనికితో ఇంతకాలం కొట్టుమిట్టాడిన బీజేపీ పట్టు బిగిస్తున్న క్రమంలో ఇలాంటి వ్యవహారాలు వెలుగులోకి రావడం ఏంటన్న విషయంపై అధిష్టానం ఆరా తీసినట్టు సమాచారం. అంతర్గత విబేధాల కారణంగానే వీరంతా స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారా లేక వీరి వెనక ఉన్న మరో కోణం ఉందా అన్న విషయంపై కూడా అధిష్టానం దృష్టి సారించినట్టు సమాచారం. పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్న నేత ఒకరు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించడంతో పాటు మరో నాయకుడు చేసిన విమర్శలపై జాతీయ నాయకత్వం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం కానుంది. స్టేట్ పార్టీ ఇంఛార్జి తరుణ్ ఛుగ్ ఇతర రాష్ట్రాల్లో పర్యటన ముగించుకుని బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. దీంతో ఆయన జాతీయ నాయకత్వంతో తెలంగాణ అంశంపై చర్చించి ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
బండికే పొడగింపు…
తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ నే కొనసాగించాలని ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాంఛన ప్రాయంగా సంజయ్ ని రెండో సారి అపాయింట్ చేస్తున్నట్టుగా జాతీయ అధ్యక్షుడు నడ్డా లెటర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు లేఖ విడుదల చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీకి హైప్ క్రియేట్ చేసిన నేపథ్యంలో బండి సంజయ్ నే కొనసాగించినట్టయితే రానున్న ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టవచ్చన్న అభిప్రాయంతో బీజేపీ అధిష్టానం ఉంది. ఆయన్నే కంటిన్యూ చేసినట్టయితే ఇప్పుడున్న ఊపు ఇలాగే కొనసాగుతుందని కూడా అధిష్టానం యోచిస్తోంది. బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ చర్యలకు పూనుకోవడంలో సంజయ్ సక్సెస్ అయ్యారన్న భావనలో అధిష్టానం ఉంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post