సుప్రిం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశం
దిశ దశ, కరీంనగర్:
సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం మేరకు కరీంనరగ్ జిల్లాలో ఇసుక రీచులను ఎక్కడికక్కడ క్లోజ్ చేయాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపిన కలెక్టర్ ఈ మేరకు ఆధేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 8 ఇసుక రీచులను వెంటనే మూసి వేసేందుకు వివిధ శాఖల అధికారులు రీచుల వద్దకు చేరుకుని లారీలను తిప్పి పంపిస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్ స్పష్టంగా పేర్కొనడంతో ఈ మేరకు మైనింగ్ కార్యకలాపాలను నిలిపి వేసేందుకు రెవెన్యూ, మైనింగ్, పోలీసు విభాగాలకు చెందిన అధికార యంత్రాంగం రీచుల వద్దకు చేరుకుని ఇసుక రవాణాను నిలిపివేయాలని ఆదేశిస్తున్నారు. అంతేకాకుండా రీచుల వద్దకు చేరుకున్న లారీలను కూడా తిప్పి పంపించాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలోని 8 రీచుల్లో ఇసుక తవ్వకాలకు బ్రేకులు పడినట్టయింది. ఉదయం ప్రజా సంఘాల నాయకుడు మార్వాడి సుదర్శన్, మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు వెంకట్ రెడ్డి, సంధి సురేందర్ రెడ్డిలు జిల్లా కలెక్టర్ ను కలిసి సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీంతో కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచులను వెంటనే మూసి వేయాలని కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడంతో సోమవారం సాయత్రం నుండి ఈ ప్రక్రియ వేగవంతగా సాగుతోంది. వివిధ శాఖలకు చెందిన బృందాలు రీచుల వారిగా వెల్లి స్టాక్ యార్డులు కూడా మూసివేయాలని ఆదేశించారు. దీంతో సోమవారం రాత్రి నుండి కరీంనగర్ జిల్లా వాసులు ఇసుక లారీల బాధ నుండి విముక్తి అయిపోయారనే చెప్పాలి.
కొంప ముంచిన ఈసీ
ఇసుక దందా విషయంలో ఒకే ఒక్క అంశం రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పాలిట శాపంగా మారింది. ఇంతకాలం యథేచ్ఛఘా ఇసుక వ్యాపారం చేసిన టీఎస్ఎండీసీ అధికారులు ఇప్పుడు చేష్టలుడిగి చూడాల్సిందే తప్ప మరో చర్యలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర ప్ఱభుత్వానికి రెవెన్యూ తీసుకొస్తున్నామన్న సాకుతో సామాన్యులకు చుక్కలు చూపించినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. రాష్ట్ర ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయని కీలక శాఖల అధికారులు ఇసుక రీచులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి ప్రత్యక్ష్య నరకం కూడా చూపించారు. ఈ నేఫథ్యంలో ఇసుక మాఫియా చెప్పినట్టుగానే అధికార యంత్రాంగం వ్యవహరించిందన్న విమర్శలకు లేకపోలేదు. మానేరు పరిరక్షణ సమితి కర్ణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కారును కూడా సీజ్ చేశారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారన్న కారణంగా పోరాటం చేసిన పాపానికి వీణవంకలో కూడా పలువురిపై కేసులు నమోదయ్యాయి. చీమ చిటుక్కుమన్నా పోలీసులు రంగంలోకి దిగి క్రిమినల్ కేసుల బూచి చూపించి సామాన్యులకు ప్రత్యక్ష నరకం చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక దశలో ఇసుక రీచుల నిర్వాహాకులే స్టేషన్లలను మానిటరింగే చేసే స్థాయికి చేరుకున్నారన్న అపవాదు కూడా మూటగట్టుకున్నారు. రీచుల వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయని కాపాడండి మహా ప్రభో అని వేడుకున్నా కనికరించని అధికారులు రీచుల మీదుగా వెల్లే ఇసుక రవాణాను అడ్డుకుంటే మాత్రం వెంటనే ఎంట్రీ ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించయిన సంఘటనల కోకొల్లలనే చెప్పాలి. దీంత పోలీసుల భయంతో రీచుల వైపు కన్నెత్తి చూసేందుకు ఆయా ప్రాంతాల వారు ప్రయత్నించిన పాపానపోలేదు. పట్టా భూములున్న వారు కూడా తమ పంటలను నాశనం చేసుకున్నారే తప్ప ఇసుక రీచుల వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించలేకపోయారు. చేసినట్టయితే ఏ చట్టం తెరపైకి వస్తుందో… ఎప్పుడు తాము కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందోనన్న భయం వారిని వెంటాడింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిర్వాహకుల కన్న ఎక్కువగా రీచులు ఏర్పాటు చేసి గ్రామాల వారే ఇక్కట్ల పాలయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఉత్తర్వులను చూపిస్తూ ఇసుక రవాణాను అడ్డుకుంటే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులను వెల్లగొట్టారు తప్ప ఇసుక లారీలను మాత్రం నిలువరించే సాహసం చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో పెద్దపల్లి బీజేపీ నాయకుడు గొట్టి ముక్కుల సురేష్ రెడ్డి కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగాల్సి వచ్చింది. చట్టాన్ని అమలు చేస్తున్నామన్న బూచి చూపిస్తూ పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదు కానీ సాధారణ పౌరులను మాత్రం ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మానేరు పరిరక్షణ సమితి టెక్నికల్ గా ఈ అంశాలపై పోరాటం చేయాలని భావించి చట్టాలు, నిభందనలను లోతుగా అధ్యయనం చేసి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ అనే అంశాన్ని పక్కాగా లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్యావరణ విభాగం నుండి అనుమతులు తీసుకోవల్సిన అధికారులు ఇంతకాలం ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఇదే పాశుపతాస్త్రంగా మానేరు పరిరక్షణ సమితి సంధించడంతో ఇసుక రీచులు మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post