ఢీల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. అరుణ్ పిళ్లైతో సహా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన తొమ్మిది మందితో కలిసి కవితను మూడు గంటల నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు చేరుకోకుండా ముమ్మర భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని లోనికి రానీయకుండా కట్టుదిట్టం చేశారు.
ఢిల్లీ పరిణామాలను సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఎప్పుటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్ కీలక నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఈడీ విచారణ దృష్ట్యా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు శుక్రవారం రాత్రే హస్తినకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు కేటీఆర్, కవిత న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తుగ్లక్ రోడ్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ. 100కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తుంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగుతోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రామచంద్ర పిళ్లైతో పాటే కవితను విచారిస్తున్నారు.
కాగా, హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు దగ్గర దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ, బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.