రాదు రాదు అంటున్నా వచ్చెనే…

మంథనిలో మారిన సీన్…

పుట్ట మధుకే ప్రాధాన్యం

దిశ దశ, పెద్దపల్లి:

ప్రత్యర్థి పార్టీ నేతల నుండి… సొంత పార్టీ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు టికెట్ రానేరాదంటూ ప్రచారం చేశారు. ఆ నేతకు ప్రత్యామ్నాయంగా మరోకరి చూస్తున్నారంటూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడయితే ప్రగతి భవన్ నుండి తనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఊరు వాడా కలియ తిరిగారు. అభ్యర్థుల జాబితాను అధినేత ప్రకటిస్తారన్న ప్రచారం జరిగినప్పుడల్లా ఆ నియోజకవర్గంలో కొత్త పేరు తెరపైకి వస్తుందని ఢంకా బజాయించి చెప్పారు. తీరా లిస్టు బయటకు రాగానే అంతా సైలెంట్ అయిపోయారు.

మంథని బీఆర్ఎస్ తీరు…

మంథని బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుపై అధిష్టానం పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయంటూ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయడంతో ఆయన రాజకీయ చరిష్మా మసకబారిపోయిందన్న రీతిలో క్యాంపెయిన్ జరిగింది. ప్రత్యర్థి పార్టీ నాయకులే కాకుండా సొంత పార్టీ నాయకులు కూడా ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. అధిష్టానం వద్ద తమ బలాన్ని, మంథని ప్రజల్లో తమకు ఉన్న పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేయని అధికార పార్టీ నేతలు కేవలం పుట్ట మధుకు టికెట్ రాదు అంటూ ప్రచారం చేయడంతోనే సరిపెట్టారు. ప్రజల్లోకి వెల్లి తమ సత్తా ఏంటో చూపించుకునేందుకు మాత్రం చొరవ చూపించలేదు. కానీ చాప కింద నీరులా ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగించినప్పటికీ అధిష్టానం మాత్రం వీటన్నింటిని పక్కన పెట్టేసింది. మంథని బీఆర్ఎస్ లో బలమైన నాయకుడు పుట్ట మధు మాత్రమేనని అధినేత కేసీఆర్ గుర్తించడంతో అసమ్మతి నాయకుల పాచికలు పారలేదనే చెప్పొచ్చు. మరో వైపున కాటారం మండలానికి చెందిన చల్ల నారాయణ రెడ్డి కూడా తనకు టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేసినప్పటికీ చివరకు ఆయనకు నిరాశే ఎదురయింది. ప్రగతి భవన్ పెద్దల ఆశీస్సులు తనకు ఉన్నాయని… ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని మంథని నియోజకవర్గం అంతా కలియ తిరిగినప్పటికీ ఆయనకు మాత్రం అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వలేదు. తాజాగా పుట్ట మధు వ్యతిరేకతతో ఉద్యమకారులు, అసమ్మతి నాయకులు అంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని మధుకు టికెట్ ఇవ్వొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను కోరారు. అయితే మంథనిలో పార్టీ ప్రభావానికి తోడు అభ్యర్థి సొంత ఓటు బ్యాంకు కూడా ఉంటే లక్ష్యం చేరుకుంటామని అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. మరో వైపున ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు కూడా పుట్ట మధుకు టికెట్ వస్తే తన గెలుపు సునాయసం అవుతుందని, నారాయణ రెడ్డికి వస్తేనే ఇబ్బంది ఉంటుందని కూడా ప్రచారం చేశారు. అయితే అధినేత కేసీఆర్ ప్రత్యర్థి పార్టీల నాయకుల ప్రచారం వెనక దాగి ఉన్న అసలు విషయాన్ని కూడా గమనించే పుట్ట మధుకు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. నారాయణ రెడ్డి ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన చెందుతున్నట్టుగా వ్యవహరించడం వెనక కారణం ఏంటన్న విషయంపై ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. దీంతో నారాయణ రెడ్డికి టికెట్ వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సునాయసమైన విజాయన్ని అందుకుంటారన్న విషయం కూడా అధిష్టానానికి చేరిన నివేదికలు తేటతెల్లం చేయడంతో పుట్ట మధు అభ్యర్థిత్వాన్నే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.

కిం కర్తవ్యమ్..?

మంథని బీఆర్ఎస్ పార్టీలో అత్యంత క్లిష్ట పరిస్థితులు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు. సొంత పార్టీలో ఉండడమా లేక ఇతర పార్టీల వైపు చూడడమా అన్న ఆలోచనలో పడిపోయినట్టుగా ఉంది. ఇటీవల ముత్తారంలో ప్రత్యేక సమావేశం పెట్టాలని సూచించిన నాయకుడు కూడా తమకు వత్తాసు పలికే పరిస్థితి లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. మరో వైపున పార్టీకి ద్రోహం చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించడంతో పుట్ట మధుకు అస్మదీయులుగా మారాలా అసమ్మతీ వర్గీయులుగానే కొనసాగాల అన్న మీమాంసలో కొంతమంది నాయకులు కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది.

You cannot copy content of this page