మాజీ మంత్రి, హూజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ కొత్తగా మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. బీజేపీలో ఆయన్ను కట్టడి చేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కమలనాథులు ఈటలపై భరోసా పెట్టుకోకుండా ఉండేలా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. విశ్వాసం లేకుండా చేయాలంటే రాజేందర్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా ఎత్తులు వేస్తే చాలు కాషాయ దండు ఆయనను అంటీ ముట్టనట్టుగా ఉంటుందన్నదే ముఖ్యమంత్రి స్కెచ్ లా కనిపిస్తోందంటున్నారు రాజకీయ నిపుణులు. తనను విబేధించి బీజేపీలో చేరిన ఈటలను తన మనిషిగా చూపించే ప్రయత్నంలో కేసీఆర్ నిమగ్నమైనట్టు భావిస్తున్నాయి. అసెంబ్లీలో పదే పదే ఈటల పేరును కేసీఆర్ ప్రస్తావిచడం వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దాదాపు 7 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగగా… చివరి రోజు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, మోదీపై కేసీఆర్ పిట్ట కథలు చెప్పి నవ్వులు పూయించారు. ఇక మాజీ మంత్రి ఈటలపై కేసీఆర్ పొగడ్తలు కురిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పలుమార్లు ఈటలను కేసీఆర్ ప్రశంసించారు. ఈటల ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పనితీరును తన ప్రసంగం గుర్తు చేస్తూ మెచ్చుకున్నారు. దీంతో ఈటలకు కేసీఆర్ గాలం వేస్తున్నారా? లేక గాయం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. 2018 ఎన్నికలప్పుడే ఈటల భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయని గులాభి పార్టీ సీనియర్లు చెప్తుంటారు. మొదట టికెట్ ఇవ్వడానికే సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని, ఈటలకు కాక మరోకరికి టికెట్ ఇచ్చేందుకు పట్టుదలగా ఉన్నారని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే కేటీఆర్, వినోద్ కుమార్ లాంటి వారు సీఎంను బలవంతంగా ఒప్పించి టికెట్ ఇప్పించారని ప్రచారం జరిగింది. ఎన్నికలు ముగిసిన తరువాత రాజేందర్ ను మంత్రి వర్గంలో తీసుకునే విషయంలో కూడా కేసీఆర్ ససేమిరా అన్నట్టుగా తెలుస్తోంది. దీంతో బోయినపల్లి వినోద్ కుమార్ పలుమార్లు రాయబారం నెరిపిన సంగతి అందరికీ తెలిసిందే. క్యాబినెట్ లో ఈటలకు అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ విముఖత చూపడంతో బోయినపల్లి వినోద్ కుమార్ పలుమార్లు హుజురాబాద్ లో పర్యటించి రాజేందర్ తో చర్చలు జరిపారు. చివరకు తనకు రెవెన్యూ, హోం, ఫైనాన్స్ వంటి కీలకమైన శాఖలు అప్పగించాల్సిందేనని రాజేందర్ తేల్చిచెప్పారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే క్యాబినెట్ విస్తరణ జరపకుండా వాయిదా వేస్తూ వచ్చారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే హుజురాబాద్ లో జరిగిన సమావేశంలో ‘గులాభి జెండా’కు ఓనర్లమంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తెలంగాణాలో పెద్ద దుమారాన్నే లేపిన ఈ కామెంట్స్ పై గంటల వ్యవధిలోనే రాజేందర్ మాట మాట మార్చారు. తాను అలా అనలేదని సోషల్ మీడియా సంయమనం పాటించాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన తరువాతే రాష్ట్ర మంత్రివిస్తరణ జరగడం, అందులో ఈటలకు వైద్య ఆరోగ్య శాఖ కెటాయించడం జరిగిపోయింది. విపత్కర కరోనా పరిస్థితులు నెలకొనడంతో కొంతకాలం ప్రశాంతంగానే సాగినప్పటికీ ఈటల అసైన్డ్ భూముల వ్యవహారంతో అలజడి మొదలై చివరకు ఆయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడం, పార్టీ ఫిరాయించి బై పోల్స్ కు వెల్లడం జరిగింది. రాజేందర్ తిరిగి ఎన్నికైన తరువాత కూడా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్లు జరగడంతో ఆయనకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మీడియా ముందు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ… తన మొఖం చూడొద్దన్న కారణంగానే సస్పెండ్ చేస్తున్నారంటూ విమర్శలు చేస్తుండే వారు. చివరకు ఈ బడ్జెట్ సమావేశాల్లో రాజేందర్ సుదీర్ఘ ఉపాన్యాసం చేశారు. వివిధ అంశాలను లేవనెత్తి అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సమాధానం ఇచ్చేందుకు శాసనసభ వ్యవహారాల మంత్రి కానీ, సంబంధిత శాఖల మంత్రికి కానీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నా కేసీఆర్ సమాధానాలు ఇవ్వడం గమనార్హం. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల పేరును దాదాపు 18 సార్లు ప్రస్తావించి బీజీపీ నేతలను డిఫెన్స్ లో పడేసేలా చేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కీలక భూమిక..
బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలను కాషాయ పార్టీలోకి లాక్కునేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలను ఆయన బీజేపీలోకి తీసుకొచ్చారు. మరికొంత మందిని బీజేపీలో చేర్పించుకునే క్రమంలో లీకులు అవుతున్నాయని, కాషాయ దళంలో కోవర్టులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈటల కామెంట్ల చుట్టే అటు బీజేపీలో ఇటు బీఆర్ఎస్ లో చర్చలు జరిగాయి. ఈ అంశం సద్దుమణిగిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఈటల తనవాడు అన్న రీతిలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఈటల లక్ష్యంగా ఆయన చేసిన కామెంట్స్ వల్ల టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి ఎవరూ వెళ్లరని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు. ఈటల బీఆర్ఎస్ మనిషి అని, బీజేపీలో చేరేందుకు ఆయనతో చర్చలు జరపడం వల్ల లాభం ఉండదని పార్టీ ఫిరాయించాలనకుంటున్న నేతలు కూడా వెనకా ముందు ఆలోచించుకుంటారన్న కారణంగానే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే బీఆర్ఎస్ నుండి బీజేపీలో ఎవరూ చేరకపోతే చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల క్రేజీ కాషాయ పార్టీలో గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని, దీని వల్ల ఈటల గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందన్నదే కేసీఆర్ ప్లాన్ అని అంటున్న వారూ లేకపోలేదు. అంతేకాకుండా బీజేపీ కూడా ఈటలపై పూర్తి భరోసా ఉంచకుండా, కీలక నిర్ణయాల విషయంలో ఆయనను దూరం పెట్టే పరిస్థితులు తయారవుతాయని కూడా అంచనా వేసి ఉండోచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈటల కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారన్నది వాస్తవం. ముఖ్యమంత్రి మాటలపై స్పందించిన రాజేందర్ కేసీఆర్ తనపై మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఆయన ట్రాప్ లో తాను పడనని అంటున్నారు. తనను గెంటేసిన పార్టీలోకి మళ్లీ వెళ్లే పరిస్థితే లేదని తేల్చి చెబుతున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఎత్తుగడ వల్ల రాజేందర్ భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఆయన తన సచ్ఛీలతను నిరూపించుకోవల్సిన పరిస్థితి ఎదురు కాగా, సీఎం వ్యాఖ్యలు తప్పని నిరూపించే పనిలో పడాల్సిన అవసరం వచ్చిందన్నది నిజం.