సెంటిమెంట్ ను ఎక్కువగా ఫాలో అయ్యే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తనకు అచ్చొచ్చిన రోజునే జాతీయ పార్టీ పతాకావిష్కరణ చేశారు. 21 ఏళ్ల తరువాత ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన సీఎం కేసీఆర్ తనకు కలిసొచ్చే అంశాలను గమనిస్తూనే వ్యూహాలను పదును పెడుతుంటారు. వచ్చే ఎన్నికల్ల నాటికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ తరుపున దేశంలోని అన్ని లోకసభ స్థానాల నుండి అభ్యర్థులను బరిలో నిలిపాలని యోచిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమాలోచనలు జరిపిన కేసీఆర్ గ్రౌండ్ వర్క్ చేసేందుకు స్పెషల్ టీంను రంగంలోకి దింపారు. అయితే అనూహ్యంగా డిసెంబర్ 8న ఎన్నికల కమిషన్ టీఆరెఎస్ ను బీఆరెఎస్ గా గుర్తించడంతో వెంటనే కార్యరంగంలోకి దూకారు. డిసెంబర్ 9న బీఆరెఎస్ జెండాను ఆవిష్కరించిన సీఎం త్వరలో ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
పుష్కర కాలం క్రితం…
2009 నవంబర్ 30న కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదించి ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అంతటా కూడా అతలాకుతలం అయిపోయింది. పల్లె నుండి పట్నం వరకు ప్రతి ఒక్కరూ స్వరాష్ట్రం సిద్దించాల్సిందేనని నిరసనలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయి కేవలం తెలంగాణ నినాదాన్ని మాత్రమే వినిపించిన పరిస్థితి. ఈ క్రమంలో డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబందించిన ప్రకటన ఆనాటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం ఖరారు అయిపోయింది. తిరిగి 14 ఏళ్లకు డిసెంబర్ 9నే బీఆరెఎస్ జెండా ఎగురవేసే అవకాశం దక్కడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, బీఆరెఎస్ అధినేత హోదాలో శుక్రవారం తెలంగాణ భవనలో బీఆరెఎస్ జెండాను ఎగురవేశారు ముఖ్యమంత్రి.
ఆ సెంటిమెంటూ…
మరో వైపున కరీంనగర్ సెంటిమెంట్ కూడా కేసీఆర్ కు కలిసొచ్చిందని స్పష్టం అవుతోంది. ఉద్యమ సమయంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కరీంనగర్ నుండే స్టార్ట్ చేసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపేవారు. కరీంనగర్ నుండి ప్రారంభించే ఏ కార్యక్రమం అయినా తనకు కలిసొస్తుందని ధృడంగా నమ్మే సీఎం అదే పంథాలో ముందుకు వెల్లి సక్సెస్ అయ్యారు కూడా. తెలంగాణ ఆవిర్భవం కోసం వేసిన ఆమరణ దీక్షకు సంబందించిన చివరి అడుగు కూడా ఇక్కడి నుండే వేశారు. అయితే అనూహ్యంగా డిసెంబర్ 8న కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ కూతురి వివాహానికి హాజరై, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెల్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకోగానే ఎన్నికల కమిషన్ బీఆరెఎస్ జాతీయ పార్టీగా గుర్తిస్తూ లేఖను పంపడం గమనార్హం. దీంతో మరోసారి కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ కలిసొచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.