దిశ దశ, హైదరాబాద్:
నిన్న మొన్నటి వరకూ పదునైన విమర్శలతో రాజకీయాలు నెరిపినా… వ్యక్తిగత సమస్య ఎదురైతే కలిసి పరామార్శించే విధానానికే ప్రాధాన్యత ఇచ్చారు కొత్త ముఖ్యమంత్రి. రాజకీయ విమర్శలతో సంబంధం లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్న తన ప్రత్యర్థిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లడంతో సరికొత్త సాంప్రాదాయానికి తెరలేపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏ రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకుని మూడు రోజులు కాకముందే విద్వేషాలను పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లి పరామార్శించడం ఆదర్శప్రాయంగా నిలిచింది. రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌజ్ లో జారిపడడంతో తొంటిలో ఫ్యాక్చర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు శుక్రవారం ఆపరేషన్ జరగగా, శనివారం యశోద ఆసుపత్రిలో ఆయనను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న కేసీఆర్ ను చూసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం. ‘X’ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ చేసి సరిపెట్టకుండా స్వయంగా వెళ్లి ఆయన బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నా రాజకీయాలు వేరు… మానవత్వాన్ని ప్రదర్శించడం వేరని రేవంత్ రెడ్డి చేతల్లో చూపించిన తీరుపై చర్చలు మొదలు పెట్టారు. ఎన్నికల వాతావరణం నుండి ఇంకా బయటపడని పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి పంతాలు, పట్టింపులకు పోకుండా వ్యవహరించిన తీరు ఆదర్శంగా నిలిచింది. ఏది ఏమైనా రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే బాధ్యతలతో మెలగాలి కానీ కక్షలు ప్రదర్శించే తీరు సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం సీఎం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా ప్రస్పుటం కావడం విశేషం. ఆయన వెంట మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు.
పొన్నం కూడా…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నా ముందు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా యశోద ఆసుపత్రికి వెళ్లి పరామార్శించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.