మేఘాలయలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీకి చుక్కెదురు అయింది. మేఘాలయలోని స్టేడియంలో ప్రధాని మోదీ బీజేపీ ర్యాలీకి ఆ రాష్ట్ర సీఎం కాన్రాడ్ కె సంగ్మా అనుమతి నిరాకరించిన వ్యవహారం సంచలనం రేపింది. కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీకి మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది.
ఈ నెల 24వ తేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది.స్టేడియంలో ఇంత పెద్ద సమావేశాన్ని నిర్వహించడం సరికాదని మేఘాలయ క్రీడా విభాగం స్పష్టం చేసింది. స్టేడియంలో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున సైట్లో ఉంచిన మెటీరియల్ భద్రత కోసం సభకు అనుమతించడం లేదని జవాబిచ్చారు. దీంతో ప్రత్యామ్నాయ వేదిక అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియంలో సభ అనుమతి విషయమై పరిశీలిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే తెలిపారు. రూ.127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గతేడాది డిసెంబర్ 16న ముఖ్యమంత్రి ప్రారంభించారు.
స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధాన మంత్రి మోదీ ర్యాలీకి స్టేడియం అసంపూర్తిగా ఉందని, అందుబాటులో లేదని ఎలా ప్రకటించగలరని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మమ్మల్ని చూసి భయపడుతున్నారా అంటూ ప్రశ్నించారు. మేఘాలయలో బీజేపీ వేవ్‌ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మీరు ప్రధాన మంత్రి ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా తెలిపారు.