దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని రామయ్య సన్నిధిలో వెలిసిన శివయ్య పానవట్టంపై నాగయ్య దర్శనం ఇచ్చి భక్తులను మంత్రముగ్దులను చేశాడు. శనివారం పట్టణంలోని శ్రీరామలయ ఆవరణలో ఉన్న శివ లింగాన్ని చుట్టుకుని నాగుపాము సాక్షాత్కరించడంతో భక్తులంతా ఒఖ్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొద్ది క్షణాల తరువాత తేరుకున్న భక్తులు అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించిందని నాగేంద్రునికి పూజలు చేశారు. గరళ కంఠుని కంఠాభారణంగా ఉండే నాగరాజు హఠాత్తుగా శివలింగాన్ని చుట్టుకుని కనిపించడంతో స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టణంలోని ఈ పురాతన ఆలయంలో నిత్యం భక్తుల రాకపోకలతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అటువంటి ఆలయంలో నాగుపాము శివలింగాన్ని అల్లుకుని పోయి దర్శనం ఇవ్వడం విశేషమని భక్తులు అంటున్నారు.
నాలుగు రోజులుగా…
నాలుగు రోజులుగా రామాలయం ఆవరణలోనే నాగు పాము తిరుగుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు భయం భయంగానే కాలం వెల్లదీశారు. అయితే సమీపంలో ఉన్న ఏ ఇంటిలోకి కూడా చొరబడని నాగుపాము శనివారం ఉదయం శివలింగానికి అల్లుకుని కనిపిండంతో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని వీక్షించారు. నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలోనే తిరిగిన నాగరాజు శివయ్యను అల్లుకున్న తరువాత తిరిగి వెల్లిపోయిందని ఆలయ పూజారి తెలిపారు.