ముగిసిన రికార్డుల సేకరణ… లోపాలపై విజి‘‘లెన్స్’’ ఇక

దిశ దశ, హైదరాబాద్:

కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండు రోజులుగా విజిలెన్స్ విభాగం తనిఖీలు జరిపి పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. 10 బృందాలుగా ఏర్పడిన విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ లోని జలసౌధతో పాటు ఈఎన్సీల ఆఫీసులు, క్యాంప్ ఆఫీసులు, ఇతర క్షేత్ర స్థాయి అధికారులు, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయా నిర్మాణ కంపెనీలకు చెందిన కార్యాలయం నుండి కూడా ఫైళ్లను సేకరించినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల పాటు విజిలెన్స్ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టి రికార్డులను సేకరించాయి. విజిలెన్స్ ఉన్నతాధికారుల నుండి వచ్చిన ఆదేశాల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను సేకరించినట్టుగా సమాచారం.

ఫస్ట్ ఫేజ్ ఇలా… 

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ గురించి ఫస్ట్ ఫేజ్ రికార్డుల సేకరణ పూర్తయినట్టుగా సమాచారం. మేడిగడ్డ కుంగుబాటుకు గురి కావడంతో పాటు ప్రాజెక్టుకు ఆయువు పట్టుగా నిలిచిన ఈ బ్యారేజీకి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. విజిలెన్స్ విభాగంలో ఉండే ఇంజనీరింగ్ అధికారుల సూచనల మేరకు ఫైళ్లను సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ రికార్డులను ఆధారం చేసుకుని స్టేజ్ వైజ్ గా ఎనాలిసిస్ చేయనున్నారు. ప్రపోజల్స్ నుండి చెక్ మేజర్ వరకు జరిగిన ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విజిలెన్స్ అధికారులు ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాణ దశలో నిపుణుల సలహాలు ఎలా తీసుకున్నారు, సాంకేతికపరంగా ఎదురైన ఇబ్బందులు ఏమిటీ..? వాటిని అధిగమించేందుకు తీసుకున్న చొరవ ఏంటీ అన్న అంశాలపై కులంకశంగా పరిశీలించనున్నారు.

ఫిజికల్ ఎంక్వైరీ అప్పుడే…

మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన రికార్డులను పూర్తి స్థాయిలో పరిశోధించిన తరువాత ఒక నివేదిక తయారు చేసుకుని విజిలెన్స్ అధికారులు ఫిల్డ్ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పిల్లర్ల వారిగా ఎనాలిసిస్ చేసిన రిపోర్టును ఆధారం చేసుకుంటూ క్షేత్ర స్థాయి విచారణ జరపనున్నారు. కాంక్రీట్ వినియోగం, స్టీల్ యూజింగ్ తో పాటు క్యూరింగ్ తదితర అంశాల గురించి ప్రాక్టికల్ గా విచారించనున్నారు. పిల్లర్ల కుంగుబాటుకు కారణం ఏంటీ..? ఇక్కడ చేపట్టిన నిర్మాణాల్లో లోపాలు, ఇతర పిల్లర్ల విషయంలో తీసుకున్న జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. నిరంతరం నీటి ప్రవాహం ఉండే అవకాశాలు ఉన్నందున వరద ఉధృతిని ఏ విధంగా అంచనా వేసి నిర్మాణాలు జరిపారు..? ఇందుకు వారు శాస్త్రీయబద్దంగా నడుచుకున్నారా లేదా అన్న వివరాలపై కూడా విజిలెన్స్ అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది. రికార్డుల పరిశీలన, క్షేత్ర స్థాయి అధ్యయనం తరువాత సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. దీనివల్ల బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన లోతుపాతులను గుర్తించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో నిర్మాణాన్ని యూనిట్ గా తీసుకుని వివిధ కోణాల్లో అధ్యయనం చేసినట్టయితే వాస్తవికతను ట్రేస్ చేసే అవకాశం ఉంటుందని నిపుణులు కూడా సలహా ఇస్తున్నట్టు  సమాచారం.

You cannot copy content of this page